నాగఅశ్విన్ క్యాస్టింగ్ ప్రతిభకు నిదర్శనం

వందల కోట్ల పెట్టుబడి పెట్టే నిర్మాత దొరగ్గానే సరిపోదు. సరైనోడి చేతిలో పడితేనే దానికి సార్థకత చేకూరుతుంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ఆధారంగా కల్కి 2898 ఏడిని దర్శకుడు నాగ అశ్విన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో అర్ధమవుతోంది కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదే క్యాస్టింగ్. పాత్రల పరంగా మనకు పైకి కనిపిస్తున్న వాళ్ళు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానినే కావొచ్చు. కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్ల కోసం ఇతర బాషల నుంచి నాగఅశ్విన్ చేసుకున్న ఎంపిక చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఉదాహరణకు మలయాళీ నటి అన్నాబెన్. హెలెన్ అనే సర్వైవల్ థ్రిల్లర్ లో ఆమె నటనకు అచ్చెరువు చెందని వాళ్ళు ఉండరు. తెలుగులో రీమేక్ చేసిన బుట్టబొమ్మ ఒరిజినల్ వెర్షన్ కప్పేలాకు తన నటనే ఆయువుపట్టుగా నిలిచింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఘనత తనది. చిన్న వయసులో పెర్ఫార్మన్స్ పరంగా సాయిపల్లవి తర్వాత వినిపించే పేరు ఈ అమ్మాయిదే. అలాంటి అన్నాబెన్ ని తీసుకొచ్చి గాలిలో తిరిగే వాహనం నడిపే కైరాగా ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చాడు నాగఅశ్విన్. సెలక్షన్ లో కాచివడబోసినట్టు వ్యవహరించే ఈ విలక్షణ దర్శకుడు ఛాయస్ గురించి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏముంటుంది.

ఇదొక్కటే కాదు వర్సటైల్ యాక్టర్ పశుపతిని తీసుకోవడంతో మొదలుపెట్టి ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల క్రితం బ్రేక్ తీసుకున్న సీనియర్ నటి శోభనను ఒప్పించడం దాక నాగఅశ్విన్ తారాగణంలో తీసుకున్న శ్రద్ధ అపారం. దీని తాలూకు ఫలితం జూన్ 27 వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ వర్గాలు విపరీతమైన ఉద్వేగంతో దీని కోసం ఎదురు చూస్తున్నాయి. మూడు నెలల నుంచి వారాల తరబడి హౌస్ ఫుల్ చేయించే సినిమా లేక బిక్కుబిక్కుమంటున్న ఎగ్జిబిటర్లకు ప్రాణ వాయువు అందించాల్సింది ఈ ప్రభాస్ మూవీనే. కేవలం ఆరు రోజుల కౌంట్ డౌన్ మాత్రమే మిగిలింది.