భళిరా భళి : లెజెండరీ హీరోలతో ప్రభాస్ జ్ఞాపకాలు

ఇవాళ ముంబైలో జరిగిన కల్కి 2898 ఏడి ప్రీ రిలీజ్ వేడుక, ప్రెస్ మీట్ అభిమానులకు మంచి ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు అందించాయి. అతిశయం అనిపించే హడావిడి లేకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటు అదే వేదికపై యాంకర్గా ఉన్న రానా సహా అందరూ చాలా కూల్ గా కనిపించడం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా జరిగిన ఓపెన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన సంగతులను బయటపడ్డాయి. ఇందులో భాగంగా బిగ్ బి, లోకనాయకుడులతో కలిసి నటించిన అనుభవం గురించి ఎదురైన ప్రశ్నకు డార్లింగ్ సమాధానాలు సగటు ఫ్యాన్ ని తలపించాయి.

ముందుగా అమితాబ్ బచ్చన్ గురించి చెబుతూ చిన్నప్పుడు ఆయన హెయిర్ స్టైల్ పొడుగ్గా ఉండే మగాళ్లకు గొప్పగా అనిపించేదని, నార్త్ తో పాటు తెలుగు తమిళం కన్నడ తదితర భాషల్లో అశేషమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గురించి ప్రభాస్ చెబుతున్నప్పుడు ఒక మాదిరి చిన్నపిల్లాడే అయ్యాడు.

కమల్ హాసన్ సాగర సంగమం చూసి అలాంటి బట్టలే కావాలని ఇంట్లో డిమాండ్ చేయడం, ఇంద్రుడు చంద్రుడు తరహాలో పొట్ట కనిపించేలా వేషధారణ వేసుకోవడం గురించి చెప్పినప్పుడు లోక నాయకుడి మొహంలో ముసిముసినవ్వులే ప్రశంసలయ్యాయి.

ఇద్దరు లెజెండ్స్ తో కలిసి నటించిన ప్రభాస్ అణుకువగా వాళ్ళ గురించి చెప్పిన తీరు ఆకట్టుకుంది. జూన్ 27 విడుదలకు ఎంతో దూరం లేకపోవడంతో ఈ ఈవెంట్ చాలా ప్రాధాన్యం దక్కించుకుంది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగే సూచన ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మధ్య గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక చేసే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

గర్భిణీగా ఉన్న దీపికా పదుకునే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెను స్టేజి మీదకు తీసుకొస్తున్నప్పుడు ప్రభాస్, రానాలు జాగ్రత్తలు తీసుకున్న వైనం వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ముఖ్యమైన సినిమా కాబట్టే తను కూడా రిస్క్ తీసుకుంది.