పుష్ప 2 ఆలస్యానికి అయిదు కారణాలు

ఊహించినట్టే ప్రచారం జరిగినట్టే పుష్ప 2 ది రూల్ వాయిదా వార్త నిన్న రాత్రి అధికారికంగా రావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఒక్కసారిగా డీలా పడ్డారు. ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కి ఏకంగా నాలుగు నెలల గ్యాప్ తీసుకుని వెళ్లిపోవడం ఒకింత నిరాశకు గురి చేసింది. అయితే దీని వెనకున్న అయిదు ముఖ్యమైన కారణాలేంటో చూద్దాం. మొదటిది కీలకమైన టాకీ పార్ట్ బ్యాలన్స్. ఫహద్ ఫాసిక్ డేట్లు దొరకడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల అతనితో ఉన్న కాంబినేషన్ సీన్లు బాగా ఆలస్యమయ్యాయి. దీంతో అనుకున్న టైం కన్నా లేట్ గా వీటిని తెరెకెక్కించాల్సిన పరిస్థితి తలెత్తిందట.

రెండోది స్పెషల్ సాంగ్. ఇప్పటిదాకా బన్నీ సరసన నర్తించే హీరోయిన్ ఎవరో లాక్ కాలేదు. జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి, దిశా పటాని అంటూ రకరకాల ఆప్షన్లు చూశారు కానీ వాళ్ళ నుంచి సానుకూల స్పందన రాలేదట. సో బెటర్ ఛాయస్ కోసం సుకుమార్ వేట కొనసాగుతూనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అయితే సిద్ధంగా ఉంది. మూడో కారణం విఎఫ్ఎక్స్ పనులు. మొదటి భాగం కన్నా సీక్వెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా స్కోప్ ఉంది. ఇది సుకుమార్ దగ్గరుండి చూసుకోవాల్సిన వ్యహవరం. గుడ్డిగా టీమ్ ని నమ్ముకుని వదిలేస్తే తేడా కొడుతుందని తెలిసే క్వాలిటీ కోసం ప్రతిదీ ఆయనే పర్వవేక్షించాల్సి ఉంటుంది.

నాలుగోది ఆర్టిస్టుల సమన్వయం. పుష్ప 2లో పెద్ద పెద్ద ఆర్టిస్టులున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ, జగపతి బాబు ఇలా వీళ్లందరి డేట్లు అనుసంధానం చేస్తూ ఇతరులకు కాల్ షీట్లు ఇవ్వకుండా భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి డేట్లు బ్లాక్ చేసుకోవడం తలకు మించి పనై కూర్చుంది. అయిదో కారణం సుకుమార్ రాజీపడని మనస్తత్వం. చిన్న సీన్ అయినా సరే తాను కోరుకున్నట్టు రాకపోతే మళ్ళీ షూట్ చేయడానికి వెనుకాడని టైపు. అలా కొంత భాగం రీ షూట్ గురైందని సమాచారం. ఏదైతేనేం మొత్తానికి అభిమానులు ఫీలయ్యేలా పుష్ప 2 దూరం జరిగిపోయింది.