పుష్ప సినిమా నేను రిజెక్ట్ చేయలేదు-సేతుప‌తి

గ‌త ద‌శాబ్ద కాలంలో సౌత్ ఇండియాలో గొప్ప పేరు, ఫాలోయింగ్ సంపాదించిన న‌టుల్లో విజయ్ సేతుప‌తి ఒక‌డు. త‌మిళంలో చిన్న చిన్న పాత్ర‌ల‌తో మొద‌లుపెట్టి ఇప్పుడు బ‌హు భాష‌ల్లో అదిరిపోయే పాత్ర‌లు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు సేతుప‌తి. ఇటీవ‌లే న‌టుడిగా విజ‌య్ సేతుప‌తి చేసిన 50వ చిత్రం మ‌హారాజ త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగులు వేస్తోంది.

ఈ నేప‌థ్యంలో తెలుగు స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌కు హాజ‌రైన సేతుప‌తి మీడియాను క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి పుష్ప సినిమాలో విల‌న్ పాత్ర‌కు విజ‌య్ సేతుప‌తిని అడిగినా ఒప్పుకోలేద‌ని అప్ప‌ట్లో వ‌చ్చిన వార్త‌ల గురించి ప్ర‌స్తావించారు. ఈ వార్త‌ల‌ను సేతుప‌తి ఖండించాడు.

పుష్ప సినిమాను తాను రిజెక్ట్ చేయ‌లేద‌ని విజ‌య్ సేతుపతి స్ప‌ష్టం చేశాడు. మ‌రి వాస్త‌వంగా ఏం జ‌రిగింద‌నే విష‌యం చెప్ప‌డానికి అత‌ను ఇష్ట‌ప‌డ‌లేదు. కొన్నిసార్లు నిజాలు మాట్లాడ‌కుండా ఉంటేనే మంచిదంటూ న‌వ్వేశాడు సేతుప‌తి. దీన్ని బ‌ట్టి పుష్ప విల‌న్ పాత్ర‌కు ముందు సేతుప‌తిని అనుకుని.. త‌ర్వాత సుకుమారే మ‌న‌సు మార్చుకుని ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తీసిన ఉప్పెన‌లో మాత్రం విల‌న్ పాత్ర‌లో న‌టించాడు సేతుప‌తి. ఆ చిత్రానికి తాను త‌క్కువ పారితోష‌కం తీసుకున్నాన‌ని.. కేవ‌లం బుచ్చిబాబు కోస‌మే ఆ చిత్రం చేశాన‌ని ఇంత‌కుముందు సేతుప‌తి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

మ‌హారాజ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌కు వ‌చ్చిన బుచ్చిబాబు.. సేతుపతి కాళ్లు మొక్కడం విశేషం. ఇక స్టేజ్ మీద సేతుప‌తి బుచ్చిబాబు గురించి గొప్ప‌గా మాట్లాడాడు. బుచ్చి త‌న త‌మ్ముడి లాంటి వాడ‌ని.. అత‌ను రామ్ చ‌ర‌ణ్‌ను డైరెక్ట్ చేస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అత‌ను చెప్పాడు.