భైరవ యాంతమ్ : డోస్ సరిపోయిందా

కల్కి 2898 ఏడి విడుదల తేదీనే కాదు దానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా వాయిదాల పర్వంలో చిక్కుకుని అభిమానులకు పెద్ద పరీక్షే పెడుతోంది. నిన్న రావాల్సిన భైరవ యాంతంని ముందు రాత్రి అన్నారు. తర్వాత ఈ రోజు ఉదయానికి షిఫ్ట్ చేశారు. అందరూ సర్దుకుని కూర్చుంటే మళ్ళీ మధ్యాన్నం పక్కాని చెప్పి రెండు గంటలకు రిలీజ్ చేశారు. స్వయానా అమితాబ్ బచ్చన్ అంతటి పెద్ద మనిషే ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేసేసరికి దర్శకుడు నాగ అశ్విన్ క్షమాపణ చెబుతూ ఆలస్యానికి గల కారణాన్ని వివరించాల్సి వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఈ డిలే విషయంలో కొంత గుర్రుగానే ఉన్నారు.

ఇదిలా ఉండగా ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ లు కలిసి నటించిన ఈ వీడియో కేవలం 2 నిమిషాల 45 సెకండ్లు మాత్రమే ఉంది. విజువల్స్ అధిక శాతం ట్రైలర్ నుంచి వాడుకోగా ఇద్దరూ డాన్స్ చేసే బిట్స్ కొన్ని పొందుపరిచారు. తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి సమకూర్చగా కుమార్ రాసిన పంజాబీ లిరిక్స్ మాత్రం యధాతథంగా ఉంచేశారు. అలా చూసుకుంటే సాంగ్ లో తెలుగు నేటివిటీ మిస్ అయినట్టే. సంతోష్ నారాయణన్ కంపోజింగ్ దిల్జిత్ ని దృష్టిలో పెట్టుకునే సాగింది. ఆర్ఆర్ఆర్ తరహాలో సినిమా ఉద్దేశాన్ని చాటేలా ఉంటే బాగుండేదని మూవీ లవర్స్ అభిప్రాయం.

ఇది ముందు అనుకున్న పాట కాదు. అసలు మూవీలో ఒక పాటే ఉంటే తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా వీటిని జోడించారు. మరో మూడు త్వరలో రాబోతున్నాయి. మొత్తానికి అంచనాల పరంగా ఈ పంజాబీ స్టైల్ తెలుగు పాట క్రమంగా ప్రేక్షకులకు ఎక్కుతుందేమో చూడాలి. అమాంతం అంచనాలు పెంచేలా లేకపోయినా దర్శకుడు నాగఅశ్విన్ సూచనల మేరకు ఉద్దేశపూర్వకంగానే ఈ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 27 ఇంకో పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రభాస్ అభిమానుల ఎగ్జైట్ మెంట్ పీక్స్ కు చేరుకుంటోంది. భారీ ఎత్తున స్క్రీన్ కౌంట్ తో కల్కి థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు.