10 రోజుల పరుగు పందెంలో కల్కి

నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల ఇంకో పదే రోజుల్లో జరగనుంది. జనవరిలో హనుమాన్ తర్వాత బాక్సాఫీస్ కు ఊపిచ్చే సినిమా రాలేదని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, బయ్యర్లకు ప్రాణవాయువు ఇచ్చే ప్యాన్ ఇండియా మూవీగా దీని మీద ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. నిర్మాణ సంస్థ వైజయంతి బృందం ఊపిరి సలపలేనంతగా చివరి దశ పనుల్లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు, సెన్సార్ కోసం ఫైనల్ కాపీ కరెక్షన్లు, రీ రికార్డింగ్ తాలూకు టచప్, మీడియాతో ఇంటర్వ్యూలు, ప్రభుత్వాలకు టికెట్ రేట్లకు సంబంధించిన విన్నపాలు ఇలా మాములు హడావిడి లేదు.

హైప్ పరంగా కొత్తగా చేయాల్సింది ఏమీ లేకపోయినా ఓపెనింగ్స్ మాత్రం భీభత్సంగా నమోదు కాబోతున్నాయి. ఒక్క టాక్ పాజిటివ్ గా వస్తే చాలు మళ్ళీ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ స్థాయిలో వసూళ్ల ఊచకోత చూడవచ్చు. 3డి వెర్షన్ ఉంది కాబట్టి అధిక శాతం థియేటర్లలో దీన్నే ప్రదర్శించబోతున్నారు. ఆదిపురుష్ కి ఈ స్ట్రాటజీ బాగా ప్లస్ అయ్యింది. కల్కి 2898 ఏడి కంటెంట్ పరంగా దాని కంటే ఎన్నో రెట్లు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. పిల్లలు పెద్దలు అందరిని మెప్పించే స్థాయిలో నాగ అశ్విన్ ఆధునిక కల్కి కథను చెప్పే విధానం ఇండియన్ స్క్రీన్ పై మొదటిసారి అనేలా ఉంటుందని యూనిట్ లీక్.

ఏదైతేనేం కల్కి ఆగమనం కోసం ఇంకో రెండు వందల నలభై గంటలు ఎదురు చూస్తే చాలు. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ఉండొచ్చని తెలిసింది. పర్మిషన్లు, జిఓలు ఇరవై అయిదు తేదీన బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్లు మాత్రం 22 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలని కోరుతున్నారు. ఇది జరగాలంటే పెంపుకు సంబంధించిన అనుమతులు ఈ వారంలోనే తెచ్చుకోవాలి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలయికలో వస్తున్న ఈ కల్కి 2898 ఏడికి సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.