600 కోట్ల సినిమా తీసి.. బుల్లి కారులో

నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రియుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న దర్శకుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. రెండో చిత్రం ‘మహానటి’తో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడతను.

తెలుగు సినీ చరిత్రలోనే అన్ని వర్గాల ప్రేక్షకులూ ముక్తకంఠంతో అద్భుత చిత్రంగా కీర్తించారంటే ‘మహానటి’ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో తనపై పెరిగిన అంచనాలను మించిపోయి ప్రభాస్‌తో ‘కల్కి’ లాంటి మెగా మూవీని లైన్లో పెట్టాడతను.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా, ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు నాగి. ఈ సినిమా ప్రోమోలు చూస్తే హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తక్కువగా కనిపించడం లేదు. ఇది పాన్ వరల్డ్ మూవీ అవుతుందన్న అంచనాలున్నాయి.

ఐతే ఇంత భారీ చిత్రం తీసిన దర్శకుడు బయట ఎంతో సింపుల్‌గా కనిపిస్తాడు. తన డ్రెస్సింగ్, ఓవరాల్ అప్పీయరెన్స్, మాట తీరు, వ్యవహార శైలి.. అన్నీ కూడా సింపుల్‌గానే కనిపిస్తాయి. ఇక లేటెస్ట్‌గా నాగి ప్రయాణించే కారును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఆల్టో తరహాలో ఒక చిన్న కారేసుకుని అతను హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నాడు. ఒక సక్సెస్ రాగానే ఫిలిం సెలబ్రెటీలు లగ్జరీ కార్లకు మారిపోతుంటారు. కానీ 600 కోట్ల సినిమా తీసిన నాగి మాత్రం ఒక సాధారణమైన, చిన్న కారులో తిరుగుతున్నాడు. అది అతను వాడుతున్నది ఎలక్ట్రిక్ కారు. పర్యావరణానికి హాని కలిగించకూడదన్న ఉద్దేశంతో అతను స్పెసిఫికేషన్లు చెప్పి ఈ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేయించుకున్నాడు.

నాగి తల్లి జయంతి రెడ్డి ఫేమస్ డాక్టర్. సేవా దృక్పథంతో వైద్య సేవలందిస్తుంటారు. ఆమెకు హైదరాబాద్‌లో మంచి పేరుంది. నాగి తండ్రి కూడా వైద్యుడే. ముందు నుంచి సింపుల్ లైఫ్ స్టైల్, ఆదర్శాలతో పెరిగిన నాగి.. ఇలాంటి కారులో తిరగడం తనను ఎరిగిన వారికి ఆశ్చర్యమేమీ కలిగించదు.

Kalki Director Nag Ashwin