బన్నీని అన్‌ఫాలో చేసేసిన మెగా హీరో

జన‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధుల్లేవు. మెగాస్టార్ చిరంజీవి స‌హా మెగా ఫ్యామిలీకి చెందిన అనేక మంది విజ‌య‌వాడ‌కు చేరుకుని ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

కానీ అక్క‌డ అల్లు అర్జున్ కానీ, అల్లు కుటుంబం నుంచి ఇంకెవ్వ‌రు కానీ క‌నిపించ‌లేదు. కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ నుంచి కాస్త వేరు ప‌డ్డ‌ట్లుగా క‌నిపిస్తున్న అల్లు అర్జున్ విష‌యంలో మెగా ఫ్యాన్స్‌లో ఒక వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా ఒక ట్వీట్ మాత్రం వేసి.. వైసీపీ అభ్య‌ర్థి అయిన శిల్పా ర‌వి కోసం నంద్యాల‌కు వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేయ‌డం వివాదాస్పదం అయింది. అప్ప‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బ‌న్నీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఆ ఒర‌వ‌డి కొన‌సాగుతూనే ఉంది.

ఇంత‌లో చిరు, ప‌వ‌న్‌ల మేన‌ల్లుడు.. హీరో కూడా అయిన సాయిధ‌ర‌మ్ తేజ్.. బ‌న్నీని సామాజిక మాధ్య‌మాల్లో అన్‌ఫాలో చేశాడ‌న్న వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ట్విట్ట‌ర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను తేజు అన్‌ఫాలో చేశాడ‌ట‌.

మ‌రి తేజు.. ఎప్ప‌ట్నుంచి బ‌న్నీని ఫాలో అవుతున్నాడు.. ఇప్పుడు స‌డెన్‌గా ప‌వ‌న్‌ ప్ర‌మాణ స్వీకారం రోజే అత‌ణ్ని ఎందుకు అన్‌ఫాలో చేశాడు అన్న‌ది తెలియాల్సి ఉంది. బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డిని సైతం తేజు అన్‌ఫాలో చేశాడ‌ట‌. బ‌న్నీతో తేజు ఎప్పుడూ అంత స‌న్నిహితంగా మెలిగింది లేదు.

గతంలో ప‌వ‌న్ అభిమానులను ఉద్దేశించి బ‌న్నీ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అనే వివాదాస్ప‌ద కామెంట్ చేసిన‌పుడు.. దానికి త‌ర్వాత ఓ సంద‌ర్భంలో చెబుతాను బ్ర‌ద‌ర్ అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు తేజు. ప‌వ‌న్ మీద తేజు అభిమానం ఎలాంటిదో తెలిసిందే కాబ‌ట్టి అత‌నిలా చేయ‌డం మెగా అభిమానుల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌డం లేదు.