సుధీర్ బాబు.. ఓ పెగ్గు క‌థ‌

చాన్నాళ్లుగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సుధీర్ బాబు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి సినిమాల‌తో ఒక టైంలో మంచి ఊపులో క‌నిపించిన అత‌ను.. ఆ తర్వాత గాడి త‌ప్పాడు. వి, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చీంద్ర.. ఇలా వరుసగా తన సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో సుధీర్ పట్ల ప్రేక్షకుల్లో క్రమంగా ఆసక్తి తగ్గిపోయింది.

ఇప్పుడు సుధీర్ నుంచి వ‌స్తున్న‌ కొత్త చిత్రం ‘హరోంహర’కాస్త ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోంది. గ‌త నెల‌లోనే రావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 14కు వాయిదా వేశారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఇందులో సుధీర్ బాబు సినిమా ఫ‌లితంపై ధీమా వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

మ‌హేష్ బాబు సినిమా అంటే ఫుల్ బాటిల్ ఇచ్చే కిక్కు ఇస్తుంద‌ని.. కానీ తాను ఆ స్థాయి కిక్ ఎప్ప‌టికీ ఇవ్వ‌లేన‌ని సుధీర్ బాబు వ్యాఖ్యానించ‌డం విశేషం. ఐతే తాను మ‌హేష్ సినిమాలిచ్చే ఫుల్ బాటిల్ కిక్ ఇవ్వ‌లేక‌పోయినా.. ఇక‌పై వ‌రుస‌గా చిన్న చిన్న పెగ్గుల రూపంలో కిక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు సుధీర్ చెప్పాడు.

వ‌చ్చే మూడేళ్లు ఇలా పెగ్స్ రూపంలో ఎంట‌ర్టైన్మెంట్ ఇస్తాన‌ని.. మూడేళ్ల త‌ర్వాత మ‌హేష్ సినిమా వ‌చ్చే స‌మ‌యానికి తాను కూడా ఫుల్ బాటిల్ కిక్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తాన‌ని సుధీర్ చెప్పాడు.

హ‌రోంహ‌ర సినిమా విష‌యంలో ఒకటి మాత్రం చెప్ప‌గ‌ల‌న‌ని.. ఈ సినిమా చూసిన సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసుకుని బ‌య‌టికి వ‌స్తార‌ని.. అలాగే మిగతా ప్రేక్ష‌కులు సిట్టింగ్‌లో కూర్చుని త‌మ హీరోకు ఇలాంటి సినిమా ప‌డితే బాగుంటుంద‌ని అనుకుంటార‌ని సుధీర్ బాబు వ్యాఖ్యానించాడు.

ఈ నెల 4న కుప్పం నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు ఘ‌న‌విజ‌యం సాధించార‌ని.. 14న కుప్పం నుంచి సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా విజ‌యం సాధిస్తాడ‌ని అత‌ను ధీమా వ్య‌క్తం చేశాడు.