భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాక ఎక్కడ చూసినా ఆ ఊరి పేరు మారుమ్రోగిపోతోంది. వేరెవరు పోటీలో నిలబడినా ఇంత ఫోకస్ వచ్చేది కాదన్నది నిజం. దేశవ్యాప్తంగా ప్రాధాన్యం రావడంతో ఇప్పుడు టాలీవుడ్ ఫంక్షన్లు అక్కడ చేసేందుకు హీరో, నిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ వరసలో ముందంజలో ఉన్నది శర్వానంద్ మనమే. ముందు ప్రీ రిలీజ్ ఈవెంటే అక్కడ చేద్దాం అనుకున్నారు. రామ్ చరణ్ ని ముఖ్య అతిథిగా తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్ హైప్ వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ మార్పు హడావిడిలో అనుమతులు రావడం కుదరలేదు.
నిన్న హైదరాబాద్ లో జరిగిన వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ మనమే సక్సెస్ మీట్ పిఠాపురంలో చేయాలని కోరుకుంటున్నట్టుగా అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు. మొదటి ఈవెంట్ తమదే కావాలనే సంకల్పాన్ని వెలిబుచ్చాడు. అక్కడికి రామ్ చరణ్ ని తీసుకొస్తే జనసేన విజయ సంబరాలతో పాటు సినిమా విజయాన్ని ఒకేసారి ఆస్వాదించవచ్చు. మనమే గురించి మాట్లాడుతూనే వచ్చిన అతిథులందరూ పిఠాపురంలో పవన్ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. బ్రో నిర్మించిన టిజి విశ్వప్రసాదే ఈ మనమేకు నిర్మాత కావడం గమనించాల్సిన విషయం.
రేపు విడుదల కాబోతున్న మనమే మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఐపీఎల్, ఎన్నికల వల్ల రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహం తేవాల్సింది ఈ సినిమానే. దీంతో పాటు మరో నాలుగైదు రిలీజులున్నా బజ్ పరంగా ముందు వరసలో ఉన్నది మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. ఏకంగా పదహారు పాటలు ఉండటం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చైల్డ్ సెంటిమెంట్ ఎంటర్ టైనర్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates