ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను ఎక్కువ శర్వానంద్ మనమే మీద ఉన్నప్పటికీ దానికి పోటీగా వస్తున్న ఇతర చిత్రాలు కూడా దేనికవే స్థాయికి తగ్గట్టు ప్రమోషన్లు గట్టిగానే చేసుకుంటున్నాయి. వాటిలో కాజల్ అగర్వాల్ సత్యభామ మొదటిది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ మీద ఒక వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. హీరో లేని ఫిమేల్ ఓరియెంటెండ్ కంటెంట్ అయినప్పటికీ హిట్ సిరీస్ తరహాలో ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. కాజల్ దగ్గరుండి ప్రమోషన్లు చూసుకుంది.
సోలో హీరోగా కనిపించడం ఎప్పుడో మానేసిన నవదీప్ లవ్ మౌళిగా వస్తున్నాడు. ట్రైలర్ చూస్తే ఘాటు కంటెంట్ బలంగా ఉన్నట్టు అనిపిస్తున్నా ప్రేమికులకు విపరీతంగా కనెక్ట్ అయ్యే కథా కథనాలు ఇందులో ఉంటాయని దర్శక నిర్మాతలు ఊరిస్తున్నారు. ఇప్పుడీ రెండు సినిమాలు పోటాపోటీ ప్రీమియర్లకు సిద్ధమవుతున్నాయి. సత్యభామ ఈ రోజు సాయంత్రం ప్రత్యేకంగా మహిళలు, అమ్మాయిలు, షీ టీమ్స్ కోసం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సాయంత్రం షో వేస్తుండగా ఒక గంట ఆలస్యంగా లవ్ మౌళిని ఆర్కె సినీప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. మీడియాతో పాటు కామన్ పబ్లిక్ కూడా ఇందులో భాగం కానుంది.
రెండు రోజుల ముందే ఇలా షో వేయడం ద్వారా టాక్ వెళ్ళిపోతుందని తెలిసినా కూడా సత్యభామ, లవ్ మౌళి బృందాలు రిస్క్ కి రెడీ అంటున్నాయి. కారణం లేకపోలేదు. ఎన్నికల ఫలితాల దెబ్బకు జనాల మూడ్ నిన్నటి వరకు పూర్తిగా ఏపీ పొలిటిక్స్ మీదే ఉంది. దానికి తగ్గట్టే టిడిపి జనసేన బిజెపి కూటమి చారిత్రక విజయం సాధించడంతో ఆ సంబరాల్లో అభిమానులు, కార్యకర్తలు మునిగితేలుతున్నారు. వాళ్ళను మెల్లగా సినిమా ప్రపంచంలోకి తీసుకురావాలంటే ఇలాంటి ప్రీమియర్లు అవసరమే. పాజిటివ్ టాక్ వచ్చి అది సోషల్ మీడియా ఇతరత్రా మాధ్యమాల్లో బయటికి వెళ్తే పబ్లిసిటీకి ఉపయోగపడుతుందిగా.