ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కల్కి సిద్ధం

ఇంకో ఇరవై రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి ప్రమోషన్లలో అసలైన అంకం రాబోతోంది. జూన్ 10 ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముందు ఏడో తేదీ అనుకున్నారు కానీ ఆంధప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతుందనే వార్తల నేపథ్యంలో నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. బిజినెస్ పరంగానే కాక హైప్ విషయంలోనూ ట్రైలర్ కీలక పాత్ర కానుంది. ఇప్పటిదాకా బుజ్జి వాహనం చుట్టూనే పబ్లిసిటీ నడిపిస్తూ వచ్చిన దర్శకుడు నాగఅశ్విన్ అసలైన కంటెంట్ బయట పెట్టలేదు.

ఇప్పుడు రాబోయే ట్రైలర్ లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఉండబోతోంది. ఈవెంట్ ముంబైలో చేస్తారా లేక తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా నగరాన్ని ఎంచుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన డెసిషన్ మాత్రం ఇంకా తీసుకోలేదు. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సోషియో ఫాంటసి డ్రామాలో దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లు కాగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. వీళ్లందరి లుక్స్ ని ట్రైలర్ వీడియోలో రివీల్ చేసే అవకాశముంది. బిగ్ బి ఎలా ఉంటారో తెలిసిపోయింది కానీ లోకనాయకుడి గెటప్ మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ఇండియా వైడ్ కల్కి 2898 ఏడికి పెద్ద ఎత్తున రిలీజ్ దక్కనుంది. అటు బాలీవుడ్ లోనూ గత అయిదారు నెలల నుంచి పూర్తి స్థాయిలో బూస్ట్ ఇచ్చిన సినిమాలు లేవు. హిట్లున్నాయి కానీ వందల కోట్ల గ్రాస్ తెచ్చిపెట్టినవి లేవు. అందుకే కల్కి ఆ లోటు తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. జనవరిలో ఇదే పరిస్థితి తలెత్తినప్పుడు నార్త్ బయ్యర్లను ఆదుకుంది హనుమానే. ఇప్పుడు మళ్ళీ కల్కి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాలి. జూన్ 27 నాటికీ రాజకీయ వాతావరణం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేసి ఉంటుంది కాబట్టి జనాలు థియేటర్లకు కల్కి నుంచి పోటెత్తుతారని ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు.