హద్దులు దాటిన మాటలకు గుణపాఠాలు

అన్ని రోజులు మనవి కావు, అన్ని వేళలు ఒకేలా ఉండవని పెద్దలు ఊరికే అనలేదు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని ఈ సామెత ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని కొందరికి నేరుగా తగులుతోంది. ఇవాళ సునామిలా వచ్చి పడిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి జాతీయ మీడియా సైతం నివ్వెరపోతోంది. టిడిపి జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావడం ముందే ఊహించినదే. అయితే కనివిని ఎరుగని రీతిలో నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కడం కూడా అనుమానమే అనే రేంజ్ లో ఘోర పరాజయం మాత్రం నభూతో నభవిష్యత్.

ఇక అసలు విషయానికి వస్తే ఎలక్షన్లకు ముందు టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు కేవలం వైసిపికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీతిన మాటలు జారేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ముందుగా పోసాని కృష్ణమురళి సంగతి చూస్తే నిన్నా మొన్నటి దాకా సినిమాల్లో నటిస్తూ కెరీర్ చక్కగా నడుస్తున్న టైంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ నోటికి బాగా పని చెప్పడం సామాన్య జనంలో ఏహ్య భావం కలిగించింది. అపోజిషన్ మీద విమర్శలు చేయొచ్చు. కానీ అవి సభ్యతను మర్చిపోకూడదు. కానీ పోసాని అది పట్టించుకోలేదు.

ఇక యాంకర్ శ్యామల ఖచ్చితంగా వైసిపి వస్తుందనే నమ్మకంతో గతంలో పవన్ కళ్యాణ్ ని పొగిడిన నోటితోనే తీవ్రమైన కామెంట్లు చేసింది. సింహం, కుందేలు అంటూ వెరైటీ కథలు చెప్పింది. కొన్ని గంటల క్రితం వరకు వంగ గీతనే గెలుస్తుందని, పవన్ సహాయం చేయడం ఎప్పుడూ చూడలేదని అబద్దాలు చెప్పేసింది. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్. రికార్డు మెజారిటీతో పవర్ స్టార్ గెలిచాడు. ఇక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న రోజా ఏకంగా పవన్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వమని శపథం చేయడం మాములు ఎలివేషన్ కాదు. తీరా చూస్తే ఆయన పెద్ద గ్యాంగ్ తో అడుగుపెట్టనుండగా రోజా ఇంటికే పరిమితం కావాలి. ఇవి గుణపాఠాలు కాక మరేమిటి.