ట్రెండింగ్ అవుతున్న నిర్మాత అశ్వినీ దత్

ఎన్నికల ఫలితాల గురించి తప్ప సినిమాలతో సహా ఇంకే ప్రస్తావన సోషల్ మీడియాతో సహా ఇంకెక్కడా కనిపించడం లేదు. ఈ తరుణంలో కల్కి 2898 ఏడి నిర్మాత అశ్విని దత్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేశారు. ముందు నుంచి టిడిపి జనసేన కూటమి విజయం పట్ల ఆయన బలమైన నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు. రెండు పార్టీలు కలిసి చంద్రసేనగా మారి నూటా అరవై సీట్లను గెలుచుకుంటామని జోస్యం కూడా చెప్పారు. కౌంట్ ఎక్కువ తక్కువ కావొచ్చేమో కానీ  మొత్తానికి పవర్ లోకి వస్తుందని ఆయన ఎప్పుడో నాలుగు నెలల క్రితం, కొద్దిరోజుల ముందు చెప్పిన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి.

ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఎక్కువ సంతోష పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారుతోంది కాబట్టి జూన్ 27 విడుదల కాబోయే కల్కి 2898 ఏడి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. పైగా అశ్వినీదత్ ఎలాంటి మొహమాటం లేకుండా టిడిపికి పూర్తి మద్దతు తెలిపిన అభిమాని. తన బ్యానర్ లో ఇంద్ర, రాజకుమారుడు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల వేడుకలకు చంద్రబాబునాయుడునే అతిథిగా తీసుకొచ్చిన ట్రాక్ రికార్డు సంవత్సరాల క్రితమే ఉంది. ఇప్పుడు ఎలా ఉండబోతోందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ లెక్కన కల్కి ఈవెంట్ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేయడం దాదాపు ఖరారే. అది ప్రీ రిలీజ్ ఈవెంటా లేక మరొకటా అనేది టీమ్ చెప్పే దాకా వేచి చూడాలి. ఇక ట్విట్టర్ ట్రెండ్ గమనిస్తే సునీల్ మర్యాద రామన్న క్లిప్ ని ఎడిట్ చేసి జగన్ సైకిల్ మీద పారిపోతూ వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరుముతూ ఉంటే మధ్యలో దత్తు గారు వచ్సినట్టుగా కట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఫలితాలను చూస్తూ  వ్యక్తిగతంగా ఆయన ఎంత సంతోషంగా ఉంటారో ఊహించుకోవచ్చు. రిజల్ట్స్ హడావిడి అయిపోతోంది కాబట్టి కల్కి పబ్లిసిటీని ఇంకో రెండు మూడు రోజుల్లో పీక్స్ కి తీసుకెళ్ళబోతున్నారు.