కల్కి వైపు దేశం మొత్తం చూసేలా

ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి విడుదలకు ఇంకో 24 రోజులు మాత్రమే బాకీ ఉంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో కిక్కిరిసిపోయిన థియేటర్లను చూసి నెలలు గడిచిపోతున్న నేపథ్యంలో బయ్యర్ల నుంచి ప్రేక్షకుల దాకా అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. ఈ నెల 7 ముంబై వేదికగా జరిపే ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరగబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావొచ్చు. తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో ఇంకో రెండు వేడుకలు చేసే ప్లానింగ్ ఉందట. ఆంధప్రదేశ్ లోని ఏదైనా ప్రధాన నగరంలో ఒకటి చేస్తే బాగుంటుందనే ఆలోచన జరుగుతోంది.

ఇప్పటికే భైరవ అండ్ బుజ్జి యానిమేషన్ ఎపిసోడ్లు జనంలోకి బాగానే వెళ్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రాజకీయ వాతావరణం పూర్తిగా చల్లబడ్డాక ఎక్కడ చూసినా కల్కి గురించి చర్చ జరిగే రేంజ్ లో పబ్లిసిటీ ప్లాన్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంచినప్పటికీ యానిమేషన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన నగరాల్లో ఉచితంగా స్క్రీనింగ్ చేయడం వెనుక ఉద్దేశం ఇదే. ఇక సెలబ్రిటీల పిల్లలకు బుజ్జి, భైరవ తరఫున ప్రత్యేక కిట్లు కానుకగా వెళ్తున్నాయి. రామ్ చరణ్, సుకుమార్, మహేష్ బాబు ఇలా పెద్ద లిస్టు పెట్టుకుని ఒక్కొక్కరిగా ఖరీదైన గిఫ్టులు పంపిస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ చేశాక మరికొన్ని వినూత్నమైన ఈవెంట్లకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక కొన్ని థియేటర్లు ఈ ప్యాన్ ఇండియా మూవీ స్క్రీనింగ్ కోసమే మార్పులు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్ సీటింగ్ మొత్తాన్ని మార్చేసి జూన్ 27 నుంచి కొత్త అనుభూతిని ఇవ్వడానికి కల్కి 2898 ఏడినే ఎంచుకున్నారు. దీన్ని బట్టే ప్రభాస్ సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కమల్ హాసన్ పాత్ర పరిచయం కోసం చెన్నైలో ఒక ఈవెంట్ చేసే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కల్కి గురించే మాట్లాడుకునేలా వైజయంతి బృందం ప్రణాళిక సిద్ధం చేసుకుంది.