ఫ్యామిలీ స్టార్…..భలే చెప్పారు సార్

ఎంతైనా సీనియర్లు సీనియర్లే. వాళ్ళ అనుభవం, నిశిత పరిశీలన సరిగ్గా వాడుకోవడమో లేదా ఆ తరహాలో ఆలోచించడం ద్వారానో ఇప్పటి దర్శకులు మంచి ఫలితాలు అందుకోవచ్చు.

సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ లో పాఠాలు పేరుతో నవతరానికి ఫిలిం మేకింగ్, రైటింగ్ మీద చక్కని వీడియోలు పెడుతుంటారు.

తాను థియేటర్లకు వెళ్లి చూడలేని సినిమాలను ఓటిటిలో చూసి రివ్యూ రూపంలో వాటి ప్లస్సు మైనస్సులను బహిర్గత పరుస్తారు. అందులో భాగంగానే ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ చూసి తనదైన శైలిలో ఫెయిల్యూర్ కి గల కారణాలను స్పష్టంగా వివరించారు.

సెకండాఫ్ లో హీరోయిన్ హీరోకి సహాయం చేస్తూ పోవడం వల్ల ఆమెదే పైచేయి అయ్యిందని, అంతే కాక ఈగోతో మృణాల్ కి విజయ్ దేవరకొండ దూరం కావడం ప్రేక్షకులకు ఎంత మాత్రం కనెక్ట్ కాని పాయింటని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ అపార్థంతో విడిపోతే అంగీకరింపు ఎక్కువగా ఉంటుందని, కానీ ఫ్యామిలీ స్టార్ లో ఇది అసంబద్ధంగా సాగిందని అన్నారు.

పైగా మాస్ హీరోతో చేయించినట్టు విజయ్ తో పెద్ద ఫైట్లు పెట్టడం, ఎవరినైనా మట్టి కరిపిస్తాడనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం యూత్ కి నచ్చ లేదని విశ్లేషించారు. మూడు కథలను ఒకే దాంట్లో ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని అన్నారు.

ఇది కాకుండా కోమాలోకి వెళ్ళిపోయిన విలన్ కొడుకుని తీసుకొచ్చి హీరోయిన్ కి పెళ్లి చేయాలనుకోవడమే రెండో సగంలో జరిగిన అతి పెద్ద తప్పుగా పేర్కొన్నారు. కనీసం పావు గంట తీసేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని అన్నారు.

ఇది ముమ్మాటికీ విజయ్ దేవరకొండ సరిపోయే కథని, కాకపోతే యూత్ లో అతని ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఎపిసోడ్లు రాసుకుంటే బాగుంటుంది కానీ సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం చేయకూడదని అన్నారు. పరశురామ్ మీద కొన్ని ప్రశంసలు గుప్పించారు. ఏమైనా పరుచూరి చెప్పినవి చాలా మంచి పాయింట్స్. స్క్రిప్ట్ రూపకల్పనలోనే ఇలాంటివి పసిగడితే సమస్యలు తగ్గించుకోవచ్చు.