ఈ రోజుల్లో పూర్తిగా కొత్త కథతో సినిమాలు తీసేవాళ్లు అరుదైనపోయారు. ఏ జానర్లో సినిమా చేసినా.. ఏదో ఒక పాత సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. అందులోనూ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటే చాలు.. జీరో నుంచి మొదలయ్యే హీరో.. అనుకోకుండా పెద్దవాడైపోవడం.. ఆపై ఒడుదొడుకులు.. చివరగా పాజిటివ్‌గా లేదా నెగెటివ్‌గా ఒక ముగింపు.. ఈ ఫార్మాట్లో సాగిపోతుంటాయి చిత్రాలు.
ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సైతం ఎన్నో పాత గ్యాంగ్‌స్టర్ డ్రామాలను గుర్తు చేసింది. ఈ చిత్రాన్ని నిజానికి శర్వానంద్‌తో చేద్దామని అనుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.
కానీ ఆల్రెడీ తాను ఇలాంటి సినిమా ఒకటి చేశానని శర్వా చెప్పినట్లు కృష్ణచైతన్య వెల్లడించాడు. ఆ సినిమా ఏదో కాదు.. సుధీర్ వర్మతో చేసిన ‘రణరంగం’. ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూస్తే ‘రణరంగం’తోనూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఓవరాల్‌గా కథ సంగతి ఇలా ఉంటే.. ఇందులో హీరో అనామకుడిగా మొదలై ఎమ్మెల్యే పంచన చేరడం.. తర్వాత ఆ ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చి తాను అభ్యర్థిగా నిలబడి గెలవడం.. ఆపై ఆ ఎమ్మెల్యేనే సవాల్ చేయడం.. ఈ లైన్ అంతా కూడా లెజెండరీ నటుడు మోహన్ బాబు సినిమా ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు గమనిస్తే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఐతే ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం ఈ చిత్రంలో లేకపోయింది. మోహన్ బాబు క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్‌ను పండించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన వల్లే ఆ సినిమా చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఆ ఇంటెన్సిటీ మిస్ అయి చాలా సీన్లు కామెడీగా తయారయ్యాయి. ఓవరాల్‌గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.