వచ్చే నెల 14 విడుదల కాబోతున్న హరోం హర మీద సుధీర్ బాబు నమ్మకం మాములుగా లేదు. కుప్పం నేపథ్యంలో తుపాకులు తయారు చేసే సుబ్రహ్మణ్యంగా అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రను పోషించడం అంచనాలు రేపుతోంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో దర్శకుడు జ్ఞాన సాగర్ తో సహా అందరూ చాలా నమ్మకంగా కనిపించారు. ఇది అన్ని వేడుకల్లో సహజంగా కనిపించేదే అయినా కంటెంట్ లో విజువల్స్ చూశాక సుధీర్ బాబు ఈసారి పొరపాట్లకు తావివ్వలేదనే అభిప్రాయం అభిమానుల్లో కలుగుతోంది. దీనికి తమిళ స్టార్ హీరో ధనుష్ కి కనెక్షన్ ఏంటో, ఊరట ఏంటో చూద్దాం.
ఒక రోజు ముందు అంటే జూన్ 13 ధనుష్ రాయన్ విడుదలను లాక్ చేసుకుంది. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. సందీప్ కిషన్ హీరో తమ్ముడిగా ప్రధాన పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రోమోలు, పాటలు హైప్ ని తీసుకొచ్చాయి. అయితే చెన్నై టాక్ ప్రకారం రాయన్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొంచెం బాలన్స్ ఉండటంతో పాటు ప్రమోషన్లకు టైం చాలదని భావిస్తున్నారట. తెలుగులో మంచి మార్కెట్ దక్కే అవకాశాలున్న రాయన్ ని అనువాదమే కదాని తక్కువంచనా వేయడానికి లేదు.
రాయన్ లో పెద్ద క్యాస్టింగ్ ఉంది. అమలా పాల్, ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, నిత్య మీనన్, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్, అనీఖా సురేంద్రన్ ఇలా చాంతాండంత లిస్టు ఉంది. వీటన్నింటి కంటే ఎక్కువ ధనుష్ స్వీయ దర్శకత్వం అసలు కీలకం. ఒకవేళ రాయన్ కనక నిజంగా పోస్ట్ పోన్ అయ్యే పక్షంలో హరోం హర నెత్తి మీద పాలు పోసినట్టే. ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న సుధీర్ బాబుకి ఇతర భాషల్లో మార్కెట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇది తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం ఓపెనింగ్స్, థియేట్రికల్ రన్ మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది.