ఇవాళ విడుదల కాబోతున్న కొత్త సినిమాలు గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశాల జాతకం ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. దేనికవే ఫలితం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇక జూన్ నెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి వారం 7న మనమే విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రమోషన్లకు ఎక్కువ టైం దొరకదని తెలిసినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కేవలం పది రోజుల ముందు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పుడు శర్వానంద్ తో సహా టీమ్ మొత్తం పరుగులు పెట్టాల్సిందే. సమయం కొరతతో పాటు కొన్ని సమస్యలు, సవాళ్లున్నాయి.
మొదటిది ఎన్నికల ఫలితాల వెల్లడి. జూన్ 4 ఏపీలో అధికార పీఠం ఎవరికి దక్కనుందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక రోజు ముందు నుంచే జనాలు దీనికి సంబంధించిన మూడ్ లోకి వెళ్ళిపోతారు. విజేత ఎవరో తెలిసాక ఆ హడావిడి, సంబరాలు ఇంకో రోజు అదనంగా ప్రభావం చూపిస్తాయి.
అంటే జూన్ మూడు నుంచి అయిదు దాకా పబ్లిక్ దాదాపు ఇదే ప్రపంచంగా ఉంటారు. శర్వానంద్ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి. మనమే మీద సరిపడా బజ్ ఇంకా రాలేదు. టీజర్ లో కథను చూచాయగా చెప్పారు కానీ ట్రైలర్ చూస్తే తప్ప అసలంతగా ఏముందో తెలిసిరాదు.
పోటీ కోణంలో చూస్తే మనమేకు సమాంతరంగా వేరే సినిమా లేదు. కాజల్ అగర్వాల్ సత్యభామ ఒక సెక్షన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న క్రైమ్ థ్రిల్లర్. నవదీప్ లవ్ మౌళి కోసం జనం ఉన్నఫళంగా మొదటి రోజే వస్తారని చెప్పలేం. ఎక్స్ ట్రాడినరీ టాక్ వస్తేనే పికప్ ని చూడొచ్చు.
ప్రేమకథా చిత్రం, భారతీయుడు రీ రిలీజ్ అవుతున్నాయి. మే 31 వచ్చినవి రెండో వారంలోనూ కొనసాగుతాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య జనాన్ని మనమే వైపు తిప్పుకోవాలంటే శర్వానంద్ బృందం అగ్రెసివ్ ప్రమోషన్లు చేసుకోవాల్సిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.