ఫ్యామిలీ మ్యాన్ హీరోతో ఇదేంటి భయ్యా

బాలీవుడ్ నటుడే అయినప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ హ్యాపీ, సుమంత్ ప్రేమకథ, క్రిష్ వేదం, పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి వాటితో మనకూ సుపరిచితుడే. ముఖ్యంగా తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే తీసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మరింత చేరువయ్యాడు. గత ఏడాది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో స్వామిజి బారిన పడి అత్యాచారానికి గురైన అమ్మాయి తరఫున వాదించే లాయర్ గా మనోజ్ బాయ్ పాయ్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇటీవలే ఈ సినిమా దర్శకుడు అపూర్వ్ సింగ్ తో మనోజ్ బాజ్ పాయ్ భయ్యాజీ అనే సినిమా చేశాడు. గత శుక్రవారం రిలీజై బిసి సెంటర్లలో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతోంది. ఏ కేంద్రాల్లో తుస్సుమంది. నిజానికి ఈ కాంబో మూవీ అనగానే ఆడియన్స్ లో మంచి అంచనాలు తలెత్తాయి. దానికి తోడు ట్రైలర్ హైప్ ని పెంచింది. కానీ దానికి తగ్గట్టు కంటెంట్ లేకపోవడం నిరాశ కలిగించింది. ఢిల్లీలో చదువుకునే రామ్ చరణ్ (మనోజ్ బాజ్ పాయ్) తమ్ముడిని విలన్ కొడుకు యాక్సిడెంట్ లో చంపేస్తాడు. దీంతో ప్రతీకారం కోసం తన పాత వేషం భయ్యాజి బయటికి తీస్తాడు రామ్ చరణ్. ఆ తర్వాత చేసే శత్రు సంహారమే కథ.

ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్లతో మాస్ కి నచ్చేలా ఓ మోస్తరుగా లాగించినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అపూర్వ్ సింగ్ చేతులు ఎత్తేశాడు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన రాజశేఖర్ అన్ననే స్ఫూర్తిగా తీసుకుని దానికి బీహార్ రంగులు అద్ది ఏదో చేయబోయి చివరికి ఖంగాళీగా మార్చేశాడు. ఇంత బలహీనమైన టేకింగ్ లోనే మనోజ్ ఒక్కడే ఈ సినిమా చూసేందుకు ఒక కారణంగా నిలిచాడు. అయినా సిర్ఫ్ బందా లాంటి గొప్ప చిత్రాన్ని తీసిన హీరో డైరెక్టర్ కాంబో నుంచి ఇలాంటి భయ్యాను ఆశించలేదని చూసిన జనాలు ఉసూరుమంటున్నారు. ప్రతిసారి మేజిక్ జరగదుగా.