బిగ్‍బాస్ అనేది వృద్ధులు పాల్గొనే రియాలిటీ షో కాకపోయినా కానీ గంగవ్వను ప్రవేశ పెడితే టీఆర్పీలకు బూస్ట్ ఇస్తుందనే ఎత్తుగడతో ఆమెను ఇంట్లోకి పంపించారు. రేటింగులు కూడా ఆమె వల్ల బాగానే వచ్చాయి. ఆమెను కనీసం అయిదారు వారాల పాటయినా హౌస్‍లో వుంచాలని చూసారు. అయితే పొద్దస్తమానం ఇరుగు, పొరుగుతో మాట్లాడుతూ, హాయిగా పొలం పనులు చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య బంధించేస్తే కష్టమనే సంగతిని బిగ్‍బాస్ క్రియేటివ్ టీమ్ ఊహించలేదు.
సకల సౌకర్యాలు ఇచ్చి, అన్నీ చూసుకుంటూ వుంటే ఆమె అడ్జస్ట్ అయిపోతుందని అనుకున్నారు. కానీ గంగవ్వ వల్ల కావడం లేదు. తన వల్ల కావడం లేదని ఆమె కన్నీరు మున్నీరయింది. అయినా కానీ మొదట్లో అలాగే వుంటుంది, తర్వాత అలవాటవుతుంది అంటూ బిగ్‍బాస్ ఆమెకు సర్ది చెప్పాలని చూస్తున్నాడు. దీంతో ఆమెకు ఓట్లేసిన జనాలే ఇప్పుడు బిగ్‍బాస్‍ని తిట్టిపోస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే వుంటే ఆమె మానసిక•గా కృంగిపోతుందని, ఈ వయసులో ఆమెను మరింత కష్టపెట్టవద్దని, ఆమె కోరినట్టుగా పంపించేయాలని సోషల్ మీడియాలో స్టార్‍మా హ్యాండిల్‍కి గట్టిగానే అక్షింతలు పడుతున్నాయి.
బహుశా ఈ వారాంతంలో ఆమెను స్వఛ్ఛందంగా బయటకు పంపించేసే అవకాశముంది. ఒకసారి ట్రాన్స్ జెండర్‍ని, ఇంకోసారి వృద్ధురాలిని… లోనికి పంపిస్తూ బిగ్‍బాస్ చేసిన ప్రయోగాలు వికటించాయి. ఇకనైనా ఇలాంటి చీప్ టీఆర్పీ ట్రిక్కులు కాకుండా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి షోని రసవత్తరంగా మారిస్తే బాగుంటుంది.