నాగ చైతన్య అస్సలు టెంప్ట్ అవట్లేదు!

శేఖర్‍ కమ్ముల డైరెక్షన్‍లో నటించాలనేది నాగ చైతన్య డ్రీమ్స్ లో ఒకటి. ‘లవ్‍స్టోరీ’తో చైతన్య ఆ కల సాకారం చేసుకున్నాడు. కమ్ముల కూడా తన స్టయిల్‍ మార్చి ఈసారి తన హీరోను ఎన్నారైలా కాకుండా మాస్‍ కుర్రాడిగా చూపిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‍ అవడంతో క్రేజ్‍ కూడా బాగానే వుంది. కరోనా బ్రేక్‍ రాకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదలయి వుండేది. ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‍ మళ్లీ మొదలయింది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ టు డిజిటల్‍ రిలీజ్‍ హక్కుల కోసం పలు సంస్థలు పోటీలో వున్నాయి.

ఆకర్షణీయమయిన ఆఫర్స్ వస్తూ వుండడంతో ఓటిటి రిలీజ్‍ కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. కానీ నాగ చైతన్య మాత్రం ఓటిటి రిలీజ్‍ పట్ల సుముఖంగా లేడట. శేఖర్‍ కమ్ముల సినిమా క్లిక్‍ అయితే ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో, తన మార్కెట్‍ని ఎంతగా ఎలివేట్‍ చేస్తుందో నాగచైతన్యకు తెలుసు. ఇప్పటికే మిడ్‍ రేంజ్‍ హీరోల్లో నాగ చైతన్యకు సాలిడ్‍ మార్కెట్‍ వుంది. శేఖర్‍ కమ్ముల సినిమా హిట్టయితే ఇక ఆ శ్రేణి హీరోలలో తనకు తిరుగుండదు. అదే ఓటిటిలో రిలీజ్‍ అయితే ఇంత గొప్ప ఛాన్స్ ఎటూ కాకుండా అయిపోతుంది.

శేఖర్‍ కమ్ములను ఓటిటి రిలీజ్‍ గురించి అడిగితే, నాగ చైతన్య నిర్ణయం తెలుసుకోమన్నాడట. అయినా ఇప్పుడు డిజిటల్‍ రిలీజ్‍ గురించి కంగారు పడాల్సిన అవసరమేంటని, థియేటర్లు ఎలాగో త్వరలో తెరిచేస్తారు కనుక బిజినెస్‍ గురించిన చింత అక్కర్లేదని నాగ చైతన్య అభిప్రాయమట.