పుష్ప విలన్‌కు అరుదైన వ్యాధి


‘పుష్ప’ మూవీలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రతో తెలుగువారికి ఎంతగానో దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. ఆ చిత్రంలో అతను కనిపించింది 20 నిమిషాలే అయినా.. తను వేసిన ఇంపాక్ట్ మాత్రం బలమైంది. అంతకంటే ముందే ఫాహద్ ‘బెంగళూరు డేస్’ సహా పలు మలయాళ చిత్రాలతో పాపులారిటీ సంపాదించినప్పటికీ.. ‘పుష్ప’తో మన వాళ్లలో వచ్చిన గుర్తింపే వేరు. ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తున్న ఫాహద్ గురించి ఇప్పుడో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించాడు.

తాను ఏడీహెచ్‌డీ అనే అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు ఫాహద్ చెప్పాడు. ఏడీహెచ్‌డీ అంటే.. అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అట. ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుందట. 41 ఏళ్ల వయసులో తాను ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు ఫాహద్ వెల్లడించాడు.

మామూలుగా ఏడీహెచ్‌డీ అనే సమస్య చిన్న పిల్లల్లో కనిపిస్తుందట. దీని వల్ల దేని మీద ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన.. తొందరగా ఆవేశపడడం లాంటి సమస్యలు తలెత్తుతాయట. ఇలాంటి లక్షణాలను గుర్తించి తాను వైద్యుడిని సంప్రదిస్తే తన సమస్య బయటపడినట్లు ఫాహద్ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ఫాహద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి ఎలాంటి చికిత్స అవసరం అనే విషయమై వైద్యులతో మాట్లాడుతున్నట్ల ఫాహద్ చెప్పాడు.

ఒక వ్యక్తికి ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు. దీనిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రుగ్మతతో బాధ పడే పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు సవాల్. నియంత్రణకు థెరపీ, కొన్ని మందులు అవసరం అవుతాయి.