రచయితల్లో ఎక్కువమంది దర్శకులవుతుంటారు. నటులు, కెమెరామెన్లు, వేరే టెక్నీషియన్లు కూడా మెగా ఫోన్ పడుతుంటారు. కానీ లిరిసిస్ట్‌గా పరిచయమై దర్శకుడిగా మారిన అరుదైన జాబితాలో కృష్ణచైతన్య ఒకడు. అతను ‘రౌడీ ఫెలో’ అనే సినిమా తీస్తున్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా రిలీజయ్యాక తన ప్రతిభేంటో తెలిసిందే. త్రివిక్రమ్ లాంటి మేటి రచయిత ఈ సినిమాలో డైలాగులకు ఫిదా అయిపోయాడు.
ఇప్పటికీ సోషల్ మీడియాలో ‘రౌడీ ఫెలో’ సినిమాలోని సీన్స్, డైలాగుల గురించి చర్చ జరుగుతుంటుంది. ఐతే విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ‘రౌడీ ఫెలో’ కమర్షియల్‌గా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కృష్ణచైతన్య.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఉమ్మడిగా నిర్మించిన ‘ఛల్ మోహన రంగ’ అనే క్రేజీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులోనూ తన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. సన్నివేశాల్లో మంచి ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమా కూడా సరిగా ఆడలేదు.
‘ఛల్ మోహనరంగ’ రిలీజైన ఆరేళ్లకు కృష్ణచైతన్య తర్వాతి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ కానుంది. మధ్యలో నితిన్‌తో అనుకున్న ‘పవర పేట’ పట్టాలెక్కలేదు. వేరే కారణాల వల్ల కూడా కృష్ణచైతన్య కొత్త చిత్రం చాలా ఆలస్యమైంది. ఐతే లేటైతే అయింది కానీ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి బజ్‌తో, సరైన టైమింగ్‌తో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతోంది.
సినిమాకు అవసరమైన హైప్ అంతా ఈ ట్రైలర్ తీసుకొచ్చేసింది. ప్రోమోలు చూస్తే స్యూర్ షాట్ హిట్ మూవీలా కనిపిస్తోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే దీని రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి దర్శకుడిగా పదేళ్ల నుంచి పోరాడుతున్న కృష్ణచైతన్యకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సరైన బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.