విశ్వక్‌తో వాళ్లిద్దరికీ డేంజర్

ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని వేసవిలో వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌ మళ్లీ ఎఫ్పుడు కళ వస్తుందా అని ఇండస్ట్రీ జనాలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం వచ్చిన ‘లవ్ మి’ కొంత మేర థియేటర్లలో సందడి తీసుకొచ్చింది.

వచ్చే వారానికి బాక్సాఫీస్‌లో మరింత కళ వస్తుందనే ఆశలు రేగుతున్నాయి. ఆ వీకెండ్‌కు ముందు ఐదు చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ పోటీ ఎక్కువగా ఉందని సుధీర్ బాబు సినిమా ‘హరోంహర’ను, కాజల్ మూవీ ‘సత్యభామ’ను వాయిదా వేసేశారు.

చివరికి మూడు చిత్రాలు రేసులో మిగిలాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది విశ్వక్సేన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ బాగా పేలడంతో హైప్ ఇంకా పెరిగింది.

సమ్మర్ స్లంప్ తర్వాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే. వచ్చే వారానికి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే. ఈ చిత్రం రొటీన్‌కు భిన్నంగా అనిపిస్తోంది. అదే రోజు రిలీజయ్యే ‘భజే వాయు వేగం’; ‘గం గం గణేశా’లకు ఇప్పటికైతే పెద్దగా హైప్ లేదు.

ఇవి సగటు హైస్ట్ థ్రిల్లర్స్ లాగా అనిపిస్తున్నాయి. రెండు చిత్రాల మధ్య పోలిక కనిపిస్తోంది. దీంతో విశ్వక్ నుంచి కార్తికేయ, ఆనంద్ దేవరకొండలకు ముప్పు పొంచి ఉన్నట్లే. కార్తికేయ చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోవడం పెద్ద మైనస్.

ఆనంద్ విషయానికి వస్తే ‘బేబి’ తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా అయినా.. చాలా ఆలస్యం కావడం ‘గం గం గణేశా’కు ప్రతికూలంగా మారుతోంది. ఐతే టాక్ బాగుంటే ఈ సినిమాలు పుంజుకోవడానికి మంచి ఛాన్సే ఉంటుంది. బాగున్న సినిమాలు పడితే ఒకేవారం రెండు మూడు చిత్రాలకు కూడా ఆదరణ దక్కుతుంది కాబట్టి ఈ చిత్రాల మేకర్స్ ఆశాభావంతో ఉండొచ్చు.