చనిపోయేవరకు సినిమాలే చేస్తా – దిల్ రాజు

ఎల్లుండి విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన దిల్ రాజు కొంత ఎమోషనల్ అయ్యారు. ఎస్విసి ఒక బ్రాండ్ గా మారాక ఇతర వ్యాపారాలు చేసి సంపద పెంచుకోమని ఎందరో సలహాలు ఇచ్చారని, కానీ తాను మాత్రం చచ్చిపోయే వరకు సినిమాలు తప్ప వేరేవాటికి జోలికి పోనని కుండబద్దలు కొట్టేశారు. ఎవరైనా తన దగ్గరకు ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి ఇండస్ట్రీకి ముడిపడినవి అయితే వింటానని, అంతే తప్ప ఆదాయం కోసమో ఆస్తుల కోసం ఇంత బిజినెస్సులు చేసే సమస్యే లేదని తేల్చి చెప్పేశారు.

ఇంత ప్యాషన్ ఉంది కాబట్టి అరవై సినిమాలకు దగ్గరవుతున్నా దిల్ రాజు అదే ఉత్సాహంతో చిన్న సినిమాలతో మొదలుపెట్టి ప్యాన్ ఇండియా మూవీస్ దాకా పదిహేనుకి పైగా పలు దశల్లో ప్రాజెక్టులను ఉంచారు. లవ్ మీ నిర్మాత ఆయన కూతురు హర్షితనే అయినప్పటికి దిల్ రాజు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆశిష్ కి ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో బాక్సాఫీస్ ని తిరిగి జోష్ తీసుకొస్తుందనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన లవ్ మీకి కీరవాణి సంగీతం, పిసి శ్రీరామ్ లాంటి టాప్ టెక్నికల్ టీమ్ తోడయ్యింది. సాంకేతికంగానూ బెస్ట్ చూడొచ్చట.

టాలీవుడ్ వరకు చూసుకుంటే శతాధిక చిత్రాలు తీసిన డాక్టర్ రామానాయుడు గారిని అందుకోవాలనేది దిల్ రాజు లక్ష్యంగా ఆయన సన్నిహితులు అంటుంటారు. ఎంత లేదన్నా ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు నిర్మాణంలో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఆ మార్కుని దాటడం కష్టమేమి కాదు. సురేష్ ప్రొడక్షన్స్ లాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని నిలపాలనేది సంకల్పంగా పెట్టుకున్నారు. 50వ సినిమా గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతున్నా అదొక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు మాటలు ఇతర నిర్మాతలకు స్ఫూర్తినిచ్చేవే.