పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్ 100తో టాలీవుడ్ కు పరిచయమై హిట్టు ఫ్లాపు పక్కపెడితే చెప్పుకోదగ్గ సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు గత ఏడాది మంగళవారం మంచి పేరు తీసుకొచ్చింది. తను 2019లో 5WS అనే సినిమా ఒప్పుకుంది. మరుసటి ఏడాది వరకు షూటింగ్ చేశారు. టైటిల్ అంత క్యాచీగా లేదని రక్షణగా మార్చారు. కానీ విడుదల చేయలేదు. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక్కడితో అయిపోలేదు.
ఫ్రెష్ గా ఆ రక్షణని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమోషన్లకు పాయల్ రాకపోతే బిజినెస్ జరగదు. కానీ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం బకాయిలు చెల్లించలేదు. ఆ విషయమే పాయల్ అడిగితే దానికి స్పందించకుండా అవమానకర రీతిలో మాట్లాడారు. దీనికి తోడు పాయల్ డేట్లు అందుబాటులో లేని విషయాన్ని ఆమె టీమ్ చెప్పినా కూడా ప్రొడక్షన్ కంపెనీ వినడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ పోజ్ చేస్తూ పబ్లిసిటీలో భాగం కావాలనే రీతిలో అభ్యంతరకర భాషలో అడిగారు. అంతే కాదు అనుమతి తీసుకోకుండా రిలీజ్ కూడా సిద్ధమవుతున్నారు.
ఇదంతా పాయల్ రాజ్ పుత్ స్వయంగా చెప్పుకొచ్చి తనకు న్యాయం చేయమని కోరుతోంది. ఏళ్ళ తరబడి పరిశ్రమలో ఉండి వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించిన హీరోయిన్ కు ఇలాంటి పరిస్థితి రావడం ఎంత మాత్రం క్షేమకరం కాదు. రెమ్యునరేషన్లు పూర్తిగా చెల్లించకపోవడం ఒక తప్పయితే తిరిగి రివర్స్ లో మాటల దాడి చేయడం ఇంకా దారుణం. నిజానిజాలు నిర్ధారణ అయ్యాక మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నట్టు మంగళవారం 2 తీస్తానని గతంలో చెప్పిన దర్శకుడు అజయ్ భూపతి నిజంగానే ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. పాయల్ తోనే ఉండొచ్చని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates