గంగవ్వ ‘బిగ్ బాస్’ నుంచి ఔటేనా?

ఈసారే కాదు.. తెలుగు బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి అందులో పాల్గొన్న కంటెస్టంట్లలో గంగవ్వ చాలా భిన్నం. ఆమె యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయి ఉండొచ్చు కానీ.. ఆమెకు పెద్దగా లోకం పోకడ తెలియదన్నది స్పష్టం. ఆమె అమాయకత్వమే ఆ వీడియోలకు పాపులారిటీ తెచ్చింది కూడా. ఈ రకంగా ఎంత పాపులర్ అయినప్పటికీ ఆమె ఇప్పటికీ మట్టిమనిషే.

అలాంటావిడను ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి తీసుకొచ్చి పెద్ద షాకిచ్చారు నిర్వాహకులు. ఐతే షో తొలి రోజుల్లో తన అమాయకత్వంతో గంగవ్వ బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆమె ఇక్కడ చేయడానికి ఏమీ లేకపోయింది. ఆమె ఎంతమాత్రం ‘గేమ్’లో భాగం కాలేదు. పైగా ఇక్కడి వాతావరణం, మనుషులతో ఆమె అలవాటు పడలేకపోయింది. దీంతో ఆమెకు ఇంటి బెంగ పట్టేసుకుంది. ఆరోగ్యంపైనా ప్రభావం పడింది.

తొలి వారం నుంచే నేను ఇంటికెళ్లిపోతా అని మొదలుపెట్టిన గంగవ్వకు.. రెండో వారంలో రోజులు గడవడం మరీ భారమైపోయింది. తాజా ఎపిసోడ్లో ఆమె ఏడుపందుకుంది. ‘బిగ్ బాస్’ను కన్ఫెషన్ రూంలో కలిసినపుడు తన గోడునంతా వెళ్లబోసుకుంది.

తనను హౌస్‌లో అందరూ బాగానే చూసుకుంటున్నారని.. కానీ తనకిక్కడ వాతావార‌ణం, ఆహారం ప‌డ‌త‌లేద‌ని ఏడుస్తూ గోడు వెల్ల‌బోసుకుంది. మ‌ట్టిలో తిరిగేదాన్ని, ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ని చెప్పింది. రెండు నెల‌లు ఉందామ‌నే వ‌చ్చాను, కానీ త‌న వ‌ల్ల కావ‌ట్లేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఒకప్పుడు తన భ‌ర్త కొట్టిన దెబ్బ‌లు ఇప్పుడు మ‌ళ్లీ నొప్పెడుతున్నాయ‌ని చెప్పింది.

మీరు గ‌ట్టిమ‌నిషి, ఇలాంటి ఎన్నో క‌ష్టాలను చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చారు అని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేసిన‌‌ప్ప‌టికీ ఆమె ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నా అని.. తనను పంపించేయండని పదే పదే చెప్పింది. తర్వాత ఆమెను వైద్యుడి గదికి పంపించారు. ఈ ఎపిసోడ్ చూశాక గంగవ్వ మద్దతుదారుల మనసు కూడా మారిపోయి ఉంటుంది.

అంత బాధపడుతున్న ఆమెను ఇంటికి పంపించేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి సీజన్లో సంపూర్ణేష్ బాబు సైతం ఇలాగే ఇబ్బంది పడి బయటికి వెళ్లిపోయాడు. అతనే ఉండలేకపోయినపుడు గంగవ్వ లాంటి లోకం తెలియని వృద్ధురాలు ఇక హౌస్‌లో కొనసాగడం కష్టమే.