మాములుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లో లేదా ఓటిటిలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్ మీడియాలో రిలీజ్ కావడం మాత్రం బహు విచిత్రం. అసలేం జరిగిందో చూద్దాం. హీరో టోవినో థామస్ తెలుసుగా. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన మిన్నల్ మురళితో మనకూ కాస్త దగ్గరయ్యాడు. మలయాళ డబ్బింగులు ఫాలో అయ్యేవాళ్ళకు ఇతని టాలెంట్ బాగా తెలుసు . తెలుగులోనూ ఆడిన 2018 పెర్ఫార్మన్స్ మరింత చేరువ చేసింది. ఇతనితో సనల్ కుమార్ శశిధరన్ అనే దర్శకుడు వజక్కు అనే సినిమా తీశాడు. ఇది ఎప్పుడో రెండేళ్ల క్రితమే పూర్తయిన చిత్రం.
ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ కు వెళ్లాల్సిన టైంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఎదురు చూసి చూసి ఓపిక నశించిన శశిధరన్ ఆ వజక్కు ఫుల్ మూవీని ఏకంగా ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. విమియో అనే వీడియో అప్లోడింగ్ సైట్ ద్వారా కేవలం అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే చూసే సౌలభ్యమున్న లింకుని ఎలాంటి పర్మిషన్లు అవసరం లేని ఫ్రీ యాక్సెస్ పెట్టేశాడు. దీంతో టోవినో థామస్ షాక్ తిన్నాడు. ట్విస్టు ఏంటంటే దీనికి నిర్మాత కూడా అతనే. కేవలం సినిమా బాగా రాలేదనే కారణంతోనే వజిక్కుని టోవినో థియేటర్లకు ఓటిటికి రాకుండా అడ్డుకున్నాడని సనల్ కుమార్ శశిధరన్ ఫిర్యాదు.
ఏదైతేనేం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా ఫైనల్ మిక్సింగ్ సరిగా కాని వజిక్కుని ఫ్యాన్స్ చూసేశారు. వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్ల హీరో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటాడు. అదే నేపథ్యంతో బాధ పడుతున్న హీరోయిన్ పరిచయమవుతుంది. కాకపోతే ఆమెకు ఓ సంతానం ఉంటుంది. ఇద్దరు కలుసుకుంటారు. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎలా ఎదురుకున్నారనే పాయింట్ మీద వజిక్కు రూపొందింది. కని కుశృతి జోడిగా నటించింది. 27వ ఇంటర్నేషనల్ కేరళ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావడమే కాక ఈ సినిమా 54వ రాష్ట్ర అవార్డులు సాధించింది. వజక్కు పదానికి అర్ధం గొడవ.