ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్ టికెట్లు చూసి ఎగ్జిబిటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులైనా కట్టేంత కలెక్షన్లు వస్తే చాలని మొత్తుకుంటున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ది ఫ్యామిలీ స్టార్ నుంచి ఈ సీన్ రిపీట్ ఆవుతూనే వస్తోంది. ది మంజుమ్మల్ బాయ్స్ కొంత ఊరట కలిగించగా చాలా చోట్ల టిల్లు స్క్వేరే నెల రోజుల వరకు ఆపద్బాంధవుడిగా కాపాడుతూ వచ్చింది. సరే పోన్లే మే వచ్చిందని సంతోషపడితే ఆ ఆనందం కూడా నిలవడం లేదు.
ఆ ఒక్కటి అడక్కు తీవ్రంగా నిరాశపరిచింది. అల్లరి నరేష్ గంపెడు ఆశలు పెట్టుకుంటే చెంచాడు కూడా తీరలేదు. ఏదో వీకెండ్ వల్ల అంతో ఇంతో నెంబర్లు కనిపించాయి కానీ ఇక సోమవారం నుంచి వసూళ్ల గురించి ఆలోచించడమూ కష్టమే. మంచి టాక్ వచ్చినా ప్రసన్నవదనం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది. సుహాస్ జనాలను ఫుల్ చేయలేకపోయాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో మాత్రమే డీసెంట్ గా ఉంది. బాక్ అరణ్మణై 4 పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. వరలక్ష్మి శరత్ కుమార్ శబరి అధిక శాతం సెంటర్లలో డే వన్ నుంచే డెఫిషిట్లు నమోదు చేస్తోంది. బాలీవుడ్ నుంచి ఎలాంటి రిలీజు లేకపోవడం ఇంకో ట్విస్టు.
ఇక్కడ కారణమేంటని చూస్తే మండే ఎండల్లో థియేటర్లకు రావాలంటే జనం ఎక్స్ ట్రాడినరి కంటెంట్ కోరుతున్నారు. యావరేజ్ లేదా ఎబోవ్ యావరేజ్ అన్నా ఒప్పుకోవడం లేదు. ఓటిటిలో చూసేస్తాంలే అంటున్నారు. బలగం వచ్చిన సంవత్సరానికే ఇంత మార్పు కనిపించడం ట్రేడ్ ని నివ్వెరపరుస్తోంది. ఎన్నికల వాతావరణ ప్రభావం లేదని చెబితే అది అబద్దమే అవుతుంది కానీ అలా అని ఆ సాకుతో ఫ్లాపులను సమర్ధించుకోలేం కదా. ఇదంతా చూస్తుంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రిలీజులు పెట్టుకోవడానికి నిర్మాతలు జంకేలా ఉన్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలకు కష్టకాలమే.