యుక్త, మధ్య వయసులో ఉన్న ప్రముఖులెవరైనా కరోనా బారిన పడ్డా పెద్దగా కంగారేమీ పడట్లేదు జనాలు. కానీ వయసు మీద పడ్డ వాళ్లు వైరస్ బారిన పడ్డారంటే అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 74 ఏళ్ల వయసున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి ఒక దశలో మృత్యువుకు చేరువగా వెళ్లడం అభిమానుల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. అదృష్టం కొద్దీ ఆయన కోలుకున్నారు. త్వరలోనే మామూలు మనిషి అవుతాడన్న ఆశాభావమూ వ్యక్తమవుతోంది.
ఇంతలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు కరోనా ఉందని వెల్లడవడంతో ఆయన అభిమానుల్లో కంగారు మొదలైంది. ఎందుకంటే ఆయన వయసు 89 ఏళ్లకు చేరువగా ఉంది. ఈ నెల 21నే ఆయన 89వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అలాంటి సమయంలో సింగీతంకు కరోనా అంటే భయపడ్డారు అభిమానులు.
కానీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సింగీతం రిలీజ్ చేసిన వీడియో చూస్తే.. ఆయనకు ఆయనే సాటి అనిపించడం ఖాయం. 80 ఏళ్ల వయసులోనూ మెగా ఫోన్ పట్టి సినిమా తీసిన ఉత్సాహవంతుడాయన. ఎప్పుడూ కుర్రాడిలా టీషర్ట్ వేసుకుని చాలా హుషారుగా కనిపిస్తారు, మాట్లాడుతారాయన. తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా ఆయన అంతే హుషారుగా చెప్పారు.
ఈ నెల 9న తనకు కరోనా ఖరారైందన్నారు. త్వరలో తన పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో చాలామంది మీడియావాళ్లు ఇంటర్వ్యూల కోసం ఫోన్ చేస్తున్నారని.. కానీ తాను కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లోకి వెళ్లడం వల్లే కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నానని ఆయన వెల్లడించారు.
డాక్టర్లు తనకు పాజిటివ్ అని చెప్పారని.. కానీ తాను 60-70 ఏళ్ల నుంచి ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటున్నానని.. ఎప్పుడూ నెగెటివ్‌గా లేనని సింగీతం చమత్కరించడం విశేషం. తనకు కరోనా లక్షణాలు, సీటీ స్కాన్‌లో ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా కనిపించాయని.. కాబట్టి 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి క్షేమంగా బయటికి వస్తానని.. అప్పుడు యధావిధిగా అన్ని పనులూ చేస్తానని.. ఈలోపు తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఈ కాలాన్ని గడిపేస్తానని ఆయన హుషారుగా చెప్పారు.
రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆద్యంతం ఆయన నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. తాను కరోనా గురించి భయపడట్లేదని అంటూనే.. జనాలు సీరియస్‌గా తీసుకుని జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచనలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates