భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు సింగల్ స్క్రీన్ల మద్దతు ఉంటుంది. అయినా సరే చాలా చోట్ల పావు వంతు నిండిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి.
మెయిన్ థియేటర్లు పర్వాలేదనిపిస్తుండగా మిగిలిన చోట్ల స్పందన ఊహించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. మొదటి రోజు గ్రాస్ ఒక కోటి అరవై లక్షలకు పైగా వచ్చినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇది నిజమే అనుకున్నా ఇంకా మెరుగైన నెంబర్లు రావాల్సింది. అల్లరి నరేష్ తనకిది కామెడీ కంబ్యాక్ అవుతుందని బలంగా నమ్మాడు.
ఈ సినిమా గురించి కాసేపు పక్కనపెడితే ఇబ్బంది ఎక్కడ వస్తోందంటే అల్లరోడి స్టామినాకు తగ్గట్టు రచయితలు, దర్శకులు కంటెంట్ రాయలేకపోతున్నారు. మాములు జోకులకు జనం నవ్వరనే లాజిక్ మర్చిపోకూడదు. పైగా జంధ్యాల, ఈవివి కాలం నాటి ఆడియన్స్ ఇప్పుడు లేరు.
ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దానికి అనుగుణంగా వాళ్ళను హాస్యంలో ముంచెత్తాలంటే ఏం చేయాలో పెన్నుతో కసరత్తు జరగాలి.
కానీ ఆ ఒక్కటి అడక్కులో అలాంటి జాడలేమి ఉండవు. తేలికపాటి డైలాగులతో ఏదో పబ్లిక్ నవ్విస్తారు లెమ్మని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తరహా రైటింగ్ కనిపించేసింది.
సో సీరియస్ నుంచి కామెడీకి షిఫ్ట్ అవుదామనుకున్న అల్లరి నరేష్ కు తాజా పరిణామం కొంత ఇబ్బంది కలిగించేదే. ఎండల వల్ల కలెక్షన్లు ప్రభావితం చెందుతున్న మాట వాస్తవమే కానీ టాక్ బాగా ఉంటే సాయంత్రం, సెకండ్ షోలైనా మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేసేవి.
దర్శకుడు మల్లి అంకం చేసిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు చేస్తున్న చేయబోయే స్క్రిప్ట్ ల మీద నరేష్ మరోసారి విశ్లేషణ చేసుకోవాలి. లేదంటే ఫలితం రిపీట్ అవుతూనే ఉంటుంది. పాటలు కూడా తన సినిమాలకు మైనసవుతున్నాయి. నెక్స్ట్ రాబోయే బచ్చల మల్లిలో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుంటే చాలు.