వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పాత్రలు చేయకపోయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా దక్కించుకుంటున్న ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ కొత్త సినిమా శబరి నిన్న విడుదలయ్యింది. ప్యాన్ ఇండియా తరహాలో బహు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడంతో ఏదో ప్రత్యేకమైన కంటెంట్ ఉంటుందనే అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయి. ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్నవదనం, బాక్ అరణ్మయి 4తో పోటీకి దిగిన శబరిలో అసలు మ్యాటర్ ఏముందో, మెప్పించిందో లేదో చూద్దాం.

సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన ఒక్కగానొక్క కూతురు రియా(బేబీ వివేక్ష)ని తీసుకుని ఉద్యోగం కోసం అటవీ ప్రాంతం పాడేరుకి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్) వంచించడంతో అతన్ని వదిలేసి విడాకులకు అప్లై చేస్తుంది. ఊరికి దూరంగా ఇల్లు తీసుకున్న సంజన వెనుక పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకున్న సూర్య (మైమ్ గోపీ) నుంచి వేధింపులు మొదలవుతాయి. పలుమార్లు హత్య ప్రయత్నం చేస్తాడు. సంజన స్నేహితుడు లాయర్ రాహుల్(శశాంక్) ఈమెకు అండగా ఉంటాడు. ఈ ప్రమాదకరమైన వలయం నుంచి సంజన ఎలా బయటపడిందనేది స్టోరీ.

దర్శకుడు అనిల్ కాట్జ్ అప్పుడెప్పుడో వచ్చిన సర్వంని స్ఫూర్తిగా తీసుకుని ఈ సైకాలజికల్ థ్రిల్లర్ రాసుకున్నాడు కానీ విపరీతమైన సాగతీత, ఏ మాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలతో శబరి చాలా భారంగా కదులుతుంది. సంజన వెనుక సూర్య పడే తతంగాన్ని అదే పనిగా రిపీట్ చేయడం చిరాకు తెప్పిస్తుంది. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింటే సిల్లీగా తోస్తుంది. ఆసుపత్రిలో బిడ్డ మార్పిడిని థ్రిల్లర్ కి ముడిపెట్టాలని చూసి ఎటెటో తీసుకుపోయాడు అనిల్. గోపి సుందర్ బీజీఎమ్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. నటీనటులు తమ పరిధిలో బాగా నటించినా లాభం లేకపోయింది.