క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్‌తో ‘వేదం’ లాంటి ప్రయోగం చేసినా.. నందమూరి బాలకృష్ణ లాంటి మాస్ హీరోను పెట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రం తీసినా క్రిష్‌కే చెల్లింది. ‘గౌతమీపుత్ర..’ తర్వాత క్రిష్ హిందీలో ‘మణికర్ణిక’ లాంటి భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు.

కంగనా రనౌత్, క్రిష్ ఇద్దరూ మంచి ఫాంలో ఉండగా.. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టుతో ఈ సినిమా రూపొందుతుండడంతో మంచి హైప్ వచ్చింది. కానీ ఈ సినిమా షూట్ అంతా పూర్తయ్యాక అనుకోని వివాదం తలెత్తింది. క్రిష్ పనితీరు నచ్చక.. ఆయన్ని పక్కనపెట్టి కంగనానే డైరెక్టర్ సీట్లోకి వచ్చి రీషూట్లు చేసింది. ముందు క్రిష్‌తో పాటు తన పేరూ దర్శకురాలిగా వేసుకున్న ఆమె.. తర్వాత పూర్తిగా క్రిష్ పేరును తప్పించింది. దీనిపై రిలీజ్ టైంలో క్రిష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలో 75 శాతం తాను తీసిన సీన్లే ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. తన పట్ల కంగనా అవమానకరంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కట్ చేస్తే ఇప్పుడు మరో భారీ చిత్రం విషయంలో క్రిష్‌ పక్కన దర్శకుడిగా మరో పేరు చేరింది. ఆ మూవీనే హరిహర వీరమల్లు. ఈ సినిమా మొదలైంది క్రిష్ దర్శకత్వంలోనే. దీని కోసం మూడేళ్లకు పైగా సమయం పెట్టాడు క్రిష్. కానీ ఎంతకీ సినిమా పూర్తి కావడం.. పవన్ ఏడాదిగా ఈ చిత్రానికి అందుబాటులో లేకపోవడంతో క్రిష్ వేరే దారి చూసుకోక తప్పలేదు. అనుష్క ప్రధాన పాత్రలో ఆయనో సినిమా తీస్తున్నాడు. మళ్లీ పవన్, క్రిష్ అందుబాటులోకి వచ్చాక మిగతా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన స్పెషల్ టీజర్లో దర్శకుడిగా క్రిష్ పక్కన నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పేరు కూడా వచ్చి చేరింది.

పవన్ అందుబాటులో ఉన్నంత వరకు సినిమా తీసింది క్రిష్‌యే. మరి ఇప్పుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా ఏం చేశాడు.. అతడి చేతుల్లోకి సినిమా ఎలా వెళ్లిందన్నది అర్థం కాని విషయం. అసలు ఇది క్రిష్ సమ్మతంతో, సామరస్య పూర్వకంగా జరిగిన మార్పేనా.. లేక ‘మణికర్ణిక’ తరహాలో ఇది కూడా వివాదాస్పదంగా మారుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకీ రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాతో క్రిష్ పూర్తిగా బంధం తెంచుకున్నట్లేనా? భవిష్యత్తులో సెకండ్ పార్ట్ మొదలయ్యే టైంకి మళ్లీ ఈ ప్రాజెక్టును ఆయన టేకప్ చేస్తాడా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయమై క్రిష్‌యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.