బెంబేలెత్తిపోతున్న ఫిలిం ఇండస్ట్రీ

ఇండియాలో ఆరు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్లు ఎంతకీ తెరుచుకోవట్లేదు. దీంతో తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న వాళ్లు కాస్తా.. ఓటీటీల వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికీ కొందరు మాత్రం థియేటర్ల మీదే ఆశలు పెట్టుకుని తమ సినిమాలను హోల్డ్ చేశారు.

ఐతే థియేటర్లు పున:ప్రారంభం అయినా కరోనా ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక నియమ నిబంధనల మధ్య వాటిని రన్ చేయాల్సి ఉంటుంది. థియేటర్లలో సగం సీట్లనే నింపాల్సి ఉంటుంది. శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లాంటివి అదనపు భారమే. ఇన్ని చేసినా జనాలు థియేటర్లకు వస్తారా లేదా అన్నది సందేహం.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే జనాలు అసలే పట్టించుకోకపోవచ్చు. పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ లేక నష్టాలు తప్పకపోవచ్చు. దీంతో అయోమయ పరిస్థితి నెలకొంది.

ఐతే జనాలు బయట అన్నిచోట్లా స్వేచ్ఛగా తిరిగేస్తున్న నేపథ్యంలో థియేటర్లకు కూడా వస్తారని కొందరంటున్నారు కానీ.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే నిరాశాజనకంగానే ఉన్నాయి. ప్రపంచ సినిమాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ మూవీ ‘టెనెట్’ను విడుదల చేస్తే దానికే బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం వచ్చింది. నెల రోజుల్లో అలవోకగా 500 మిలియన్ డాలర్లు కొల్లగొట్టే సత్తా ఉన్న ఆ సినిమా కరోనా పుణ్యమా అని ఇప్పటిదాకా 205 మిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం 250 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుందట.

నోలన్ సినిమా, అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది బ్రేక్ ఈవెన్ కాలేకపోతోందంటే వరల్డ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి వార్తలు చూసిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జనాల్లో ఆందోళన ఇంకా పెరిగిపోయింది. థియేటర్లు తెరుచుకున్నా కొత్త సినిమాలను విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాకపోవచ్చని, ఇన్ని నెలలు ఆగి కూడా ప్రయోజనం ఉండదని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పట్లా థియేటర్లు మామూలుగా నడిచే పరిస్థితులు ఎప్పటికి వస్తాయో అని ఆవేదన చెందుతున్నారు. ‘టెనెట్’ పరిస్థితి చూశాక మరిన్ని పెద్ద సినిమాలు ఓటీటీల వైపు అడుగులు వేస్తే ఆశ్చర్యం లేదేమో.