బాక్సాఫీస్ చాలా నీరసంగా ఉంది. థియేటర్లకు కనీసం కరెంటు బిల్లులు కట్టేంత జనం రాక ఎగ్జిబిటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ ,లాంటివి కొంత ఊరట కలిగిస్తున్నా అవి కూడా ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నాయి. ఓటిటి డేట్లు వచ్చేయడంతో ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఆసక్తి తగ్గిపోతుంది. మొన్న శుక్రవారం రిలీజైన వాటిలో ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఎగ్జిబిటర్లు, మూవీ లవర్స్ అందరి దృష్టి రాబోయే ఫ్రైడే మీద ఉంది. ఈ నేపథ్యంలో విశాల్, రోహిత్ లకు బంగారం లాంటి అవకాశం దొరికిందని చెప్పాలి.
గురువారమే నారా రోహిత్ ప్రతినిధి 2 వస్తోంది. సమకాలీన రాజకీయాల మీద వేసిన సీరియస్ సెటైర్ కావడంతో ట్రైలర్ చూశాక అంచనాలు మొదలయ్యాయి. ప్రెజెంటేషన్ బాగుంటే ఖచ్చితంగా వసూళ్లు బాగుంటాయి. ఎన్నికల వాతావరణం వేడిగా ఉన్న తరుణంలో దీనికొచ్చే టాక్ కనక పాజిటివ్ గా ఉంటే పార్టీల నుంచి కూడా మద్దతు ఉంటుంది. మరుసటి రోజు విశాల్ రత్నంతో వస్తున్నాడు. ఊర మాస్ అరుపుల దర్శకుడు హరి తీసిన సినిమా ఇది. ట్రైలర్ మీద ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపించలేదు కానీ హీరో దర్శకుడు మాత్రం డైరెక్ట్ గా తెరమీద సర్ప్రైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.
స్తబ్దుగా ఉన్న థియేటర్ల వాతావరణాన్ని సందడి కలిగించేలా ఈ రెండు వర్కవుట్ అయితే మళ్ళీ పబ్లిక్ ని హాళ్లలో చూడొచ్చు. ఆపై మే 3న ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి లేకపోవడం ప్రతినిధి 2, రత్నంలకు కలిసి వచ్చే అంశం. ఇంత దారుణమైన డ్రై పీరియడ్ ని గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్స్ టాక్. రోహిత్, విశాల్ లు కనక ఈ బంగారం లాంటి ఛాన్స్ ని వాడుకుంటే బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ ఏకంగా హిట్టు కొట్టేయొచ్చు. మే 13 ఏపీ ఎలక్షన్ల దాకా జనాల మూడ్ సినిమాల వైపు పెద్దగా ఉండదనే అభిప్రాయం తప్పని ఋజువు చేయాలంటే ఈ రెండూ చాలా బాగున్నాయనినిపించుకుంటే చాలు.