దేవర హక్కుల కోసం హేమాహేమీలు

జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. విడుదల తేదీ అక్టోబర్ 10లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మెల్లగా డీల్స్ వైపు నిర్మాతలు దృష్టి సారించినట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కనిష్టంగా 120 కోట్లతో మొదలుపెట్టి 140 కోట్ల దాకా ఆశిస్తున్నట్టు తెలిసింది. తారక్ సోలో హీరోగా చేసిన ఏ మూవీ ఇప్పటిదాకా ఇంత రేట్ పలకలేదు. ఆర్ఆర్ఆర్ కు తనతో పాటు రాజమౌళి, రామ్ చరణ్ బ్రాండ్లు తోడయ్యాయి కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోలేం.

దేవరకు ఇంత పెద్ద మొత్తం చెబుతున్నా బయ్యర్లు ఆసక్తిగానే ఉన్నారట. ముఖ్యంగా దిల్ రాజు, మైత్రి మేకర్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ లాంటి హేమాహేమీలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హిందీలో కరణ్ జోహార్, అనిల్ తదానితో అగ్రిమెంట్ జరిగిపోయింది కాబట్టి నార్త్ మార్కెట్ గురించి టెన్షన్ లేదు. ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ కొనేసుకుంది. శాటిలైట్ హక్కులు ఇంకో నెలలో క్లోజ్ అయిపోతాయి. సో ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు పలుకుతున్న ధర వర్కౌట్ కావాలంటే సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయాలు సానుకూలంగా ఉండాలి.

ఇంకా సరైన టీజర్ రాలేదు. అనిరుద్ రవిచందర్ పాటల మీద ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని లిరికల్ వీడియోస్ ప్రత్యేకంగా ప్లాన్ చేయబోతున్నారు. ట్రైలర్ విజువల్స్ కి అభిమానుల మతులు పోయేలా కట్ చేస్తారట. ప్రస్తుతం వార్ 2 కోసం ముంబై వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చేలోపు కొరటాల శివ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేశారు. ఏప్రిల్ మినహాయిస్తే ఇంకో అయిదు నెలలు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న దేవరకు సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.