విశాల్ నిర్భయంగా నిజాలు చెప్పేస్తున్నాడు

మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశాల్ సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో సక్సెస్ దక్కి సంవత్సరాలు గడిచిపోయాయి. మార్క్ ఆంటోనీ తమిళంలో బ్లాక్ బస్టరయ్యింది కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అందుకే రత్నం మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సింగం సిరీస్ తో సూర్యకు కమర్షియల్ స్కేల్ పెంచిన దర్శకుడు హరితో చేతులు కలిపాడు. ట్రైలర్ రొటీన్ గానే అనిపించినా అసలు కంటెంట్ వేరే లెవెల్ ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే విశాల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరలవుతున్నాయి.

కోలీవుడ్ లో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెడ్ జయింట్ ఫిలింస్. సాక్ష్యాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి నేతృత్యంలో ఇది నడుస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ ఏకఛత్రాధిపత్య ధోరణిలో ప్రవర్తిస్తోందని, పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఎవరూ ఏమీ అనలేకపోతున్నారని, మార్క్ ఆంటోనీ టైంలో చాలా ఇబ్బందులకు గురి చేశారని ఓపెన్ గా అనేశాడు. అంతే కాదు ఏప్రిల్ 26న రాబోయే రత్నంకు అడ్డంకులు సృష్టించినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చాడు. రెడ్ జయింట్ మీద ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలున్నాయి కానీ ఎవరు మీడియాకు చెప్పలేదు.

గత ఏడాది తమిళనాడులో వారసుడు టైంలో పోటీగా ఉన్న తెగింపుకు ఎక్కువ థియేటర్లు కేటాయించేడం వల్ల తనకు అన్యాయం జరిగి దిల్ రాజు చాలా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చిందని పలు కథనాలు వచ్చాయి. అప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది రెడ్ జయింటే. విశాల్ చెబుతున్న దాని ప్రకారం వాళ్ళు సృష్టిస్తున్న మోనోపోలీ వల్ల ఎందరో నిర్మాతలు రెవిన్యూ నష్టపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఇతర ప్రొడ్యూసర్లు మౌనంగా ఉన్నారేమో కానీ నేను మాత్రం పోరాడతా అంటున్నాడు విశాల్. అన్నట్టు త్వరలోనే రాజకీయ ప్రవేశం కూడా చేయబోతున్నాడు.