థియేటర్ అనుభూతికి, ఇంట్లో కూర్చుని చూడటానికి ఉన్న వ్యత్యాసం చిన్నది కాదు. అందుకే కొన్ని చిత్రాలకు రెండింట్లో ఒకే ఫలితం రాకపోవడం దాన్నే సూచిస్తుంది. నిన్న ఓటిటిలో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలొచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మూడు. మలయాళం బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగు రిలీజ్ కొంత ఆలస్యమైనా సరే మంచి ఆదరణ దక్కించుకుంది. పదిహేడు కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ కొట్టేసింది. తీరా నిన్న ఆహా ద్వారా స్ట్రీమింగ్ లోకి వచ్చాక కొందరు ఓవర్ రేటెడ్ అని మరికొందరు అంతగా ఏముందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
విశ్వక్ సేన్ ‘గామి’ జీ5లో అందుబాటులోకి వచ్చింది. పెద్ద తెరపై డాల్బీతో చూసిన ఎక్స్ పీరియన్స్ కి, చిన్న స్క్రీన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేని ఒక మాములు సౌండ్ తో చూసిన దానికి వచ్చే తేడా ఇక్కడ మిశ్రమ స్పందన దక్కేలా చేసింది. శ్రీవిష్ణు ఎంటర్ టైనర్ ‘ఓం భీం బుష్’ మీద కాస్త నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఫార్వార్డ్ చేయకుండా చూడలేకపోయామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేనికీ యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం గమనించాల్సిన విషయం. అమెజాన్ ప్రైమ్ లో హఠాత్తుగా వచ్చిన ‘యాత్ర 2’కి కనీస బజ్ లేక ఆడియన్స్ లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఒక సినిమా థియేటర్ లో ఎంత బ్రహ్మాండమైన వసూళ్లు దక్కించుకున్నా అదే స్థాయి స్పందన ఓటిటిలో రాకపోవచ్చు. గతంలో జాతిరత్నాలు, ఉప్పెనలకు సైతం ఇదే తరహా అనుభవం ఎదురయ్యింది. అన్నింటికి ఇలాగే జరుగుతుందని కాదు. హనుమాన్ ఇటు థియేటర్ అటు ఓటిటి రెండు చోట్లా అదరగొట్టే కలెక్షన్స్, వ్యూస్ తెచ్చుకుంది. చూస్తుంటే కరోనా టైంలో అతుక్కుపోయే రేంజ్ లో ఓటిటికి అలవాటు పడ్డ ఆడియన్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. తాపీగా చూసే వెసులుబాటు వల్లే నిజమైన ఫీల్ మిస్సవుతుందనే కామెంట్లో నిజం లేకపోలేదు.