ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తుఫాను హోరు మధ్య జనజీవనం కకావికలమైన సమయంలో 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిరంజీవి శ్రీదేవి జంట, అమ్రిష్ పూరి విలనీ, ఎవర్ గ్రీన్ ఇళయరాజా పాటలు ప్లస్ నేపధ్య సంగీతం, జంధ్యాల సంభాషణలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఆల్ టైం క్లాసిక్ గా నిలిచేందుకు దోహద పడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత కూడా దాని కల్ట్ స్టేటస్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. రీ రిలీజ్ కోసం వైజయంతి మూవీస్ ని అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎంతగా కోరుకుంటున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లు కలిసి చేస్తే బాగుంటుందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కానీ ప్రాక్టికల్ కోణంలో చూస్తే అదంత సులభం కాదు. ఎందుకంటే నటీనటులు, సాంకేతిక వర్గంలో కీలకమైన కొందరు ఇప్పుడు లేరు. కాలం చేశారు. పైగా బాహుబలి రేంజ్ లో కథా కథనాలు, బడ్జెట్ ఉంటే తప్ప ఇప్పటి జనరేషన్ ని మెప్పించడం కష్టం. ఆసలు పాయింట్ ఏంటంటే నిర్మాత అశ్వినిదత్ తాను తప్ప వేరే బ్యానర్ లో తీసేందుకు అనుమతి ఇవ్వరు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే జగదేకవీరుడి వారసుడిని తెరమీద చూపించడం పెద్ద టాస్కే. అయితే మూవీ లవర్స్ అభిప్రాయం ఇంకోలా ఉంది. షోలే, అడవి రాముడు, మాయాబజార్, దానవీరశూరకర్ణ, మంగమ్మగారి మనవడు, శివ లాంటి క్లాసిక్స్ ని మళ్ళీ రీమేక్ చేయడం కానీ కొనసాగింపు పేరుతో 2 నెంబర్ వేసి తీయడం కానీ చేయకూడదని అంటున్నారు. పలు సందర్భాల్లో గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ తీస్తే మీరు నటిస్తారా అని చరణ్ ని అడిగితే నో చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఊహల్లోనే గొప్పగా కనిపిస్తున్న జగదేకవీరుడు అతిలోకసుందరి 2 నిజంగా జరిగితే అద్భుతమే.