శ్రీరంగనీతులు రిపోర్ట్ ఏంటి

కలర్ ఫోటో నుంచి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ కు రైటర్ పద్మభూషణ్ విజయం మార్కెట్ ని పెంచింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి బిజినెస్ బాగా జరగడానికి కారణం ఇదే. మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా దానికైన బడ్జెట్ కి సేఫ్ గానే గట్టెక్కింది. అయితే ఎందుకో శ్రీరంగనీతులు విషయంలో మాత్రం ముందు నుంచి బజ్ లేకపోవడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. నిర్మాతలు ప్రమోషన్ చేయకపోవడం మైనస్ కాగా కంటెంట్ ని సరైన రీతిలో ఆడియన్స్ కి రిజిస్టర్ చేయడంలో టీమ్ ఫెయిలయ్యింది. ఇంతకీ అసలు సినిమాలో మ్యాటర్ ఏముందో చూస్తే స్పష్టత వచ్చేస్తుంది.

శ్రీరంగనీతుల్లో మూడు కథలున్నాయి. రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి వాటిని ఫ్లెక్సిలుగా వేయించి అందరూ తన గురించి మాట్లాడుకోవాలని తపించే కుర్రాడు శాంసంగ్ శివ(సుహాస్). ఓ రాత్రి బస్తీలో ఇతని బ్యానర్ మాయం కావడంతో ప్రత్యర్థులతో గొడవ పడతాడు. జీవితంలో ఏదీ సాధించలేక నిరాశలో ఉన్న కార్తీక్ (కార్తీక్ రత్నం) మాదకద్రవ్యాలకు బానిస కావడమే కాక తన చేష్టల ద్వారా తండ్రి, తమ్ముడిని రిస్క్ లో పెడతాడు. ప్రేమించుకున్న వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహాని శర్మ)లు పెద్దలకు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. చివరికి ఏం జరిగిందనేది స్టోరీ.

దర్శకుడు ప్రవీణ్ కుమార్ వెబ్ సిరీస్ తరహా కంటెంట్ రాసుకుని దాన్ని సినిమాకు అనుగుణంగా మార్చే క్రమంలో స్క్రిప్ట్, ట్రీట్ మెంట్ సరిగా రాసుకోకపోవడంతో శ్రీరంగనీతులు నిస్సారంగా సాగుతుంది. దేనికీ సరైన ముగింపు లేకపోవడంతో ప్రేక్షకులు ఎవరికి వారు తమకు నచ్చిన రీతిలో కంక్లూజన్ ఇచ్చుకునేలా చేశారు. నెరేషన్ మొత్తం అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. ఆరిస్టుల పరంగా ఎలాంటి లోపాలు లేకపోయినా బలం లేని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే వల్ల చివరికి నిట్టూర్పే మిగులుస్తుంది. సినిమా చూశాక బహుశా ఫలితాన్ని ముందే ఊహించి మేకర్స్ పబ్లిసిటీ హడావిడి చేయకుండా వదిలేశారేమో అనిపిస్తుంది.