మూడేళ్లకుపైగా వాయిదా పడుతూ వచ్చిన మైదాన్ ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టింది. అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మీద ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోటీగా బడేమియా చోటేమియా లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ఉన్నప్పటికీ ఆడియన్స్ అధిక శాతం దీనివైపే ఆసక్తి చూపారు. రిలీజ్ డేట్ ఇవాళ అయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు వేశారు. ప్రియమణి భార్య పాత్రలో నటించగా భారీ బడ్జెట్ తో అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందించారు. ఇంతకీ పీరియాడిక్ బయోపిక్ ఎలా ఉందో లుక్ వేద్దాం.
1952 ఒలంపిక్స్ లో ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ యుగోస్లేవియా చేతిలో దారుణంగా ఓడిపోతుంది. దీంతో హైదరాబాద్ కు చెందిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం (అజయ్ దేవగన్) వివిధ నగరాలు తిరిగి బెస్ట్ టాలెంట్ ని వెతికి పట్టుకుంటాడు. ఎంత బాగా ఆడించినా గెలుపు తీరాలకు చేరలేకపోతాడు. దీంతో ఉద్యోగం పోతుంది. ఈలోగా ఆరోగ్యానికి సంబంధించి ఒక భయంకర నిజం తెలుస్తుంది. ఎలాగైనా దేశాన్ని విజేతగా నిలపాలని కమిటీని, ప్రభుత్వాన్ని ఒప్పించిన రహీం 1962 ఏషియన్ గేమ్స్ కు కొత్త బృందాన్ని తీసుకెళ్తాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య బలమైన ప్రత్యర్థిని ఓడించి 47 కోట్ల ప్రజల కలను నిజం చేస్తాడు.
ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ మైదాన్ వాటికి భిన్నంగా నిలవడానికి కారణం ఇది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో జరిగిన నిజమైన కథ కావడం. కమర్షియల్ అంశాలు ఆశించే వాళ్లకు అంత రుచించకపోవచ్చు కానీ ఎమోషన్స్ ని లైట్ గా టచ్ చేస్తూ ఓవర్ డ్రామా లేకుండా సింగల్ పాయింట్ మీద అమిత్ శర్మ నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ బిజిఎం, ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం కవచంలా నిలబడ్డాయి. లగాన్, చక్ దే ఇండియా స్థాయిలో గూస్ బంప్స్ ఇవ్వకపోవచ్చు కానీ దేశభక్తి కూడిన బరువైన భావోద్వేగం ఇవ్వడంలో మైదాన్ ఫెయిలవ్వలేదు.