గోపీచంద్ ను రక్షించడానికి పీపుల్స్ మీడియా

యాక్షన్ హీరో గోపీచంద్ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అతను చూడలేదు. గౌతమ్ నంద, సీటీమార్ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. మిగతావన్నీ డిజాస్టర్లే. లేటెస్ట్‌గా ‘భీమా’తో మరో డిజాస్టర్‌ను అతను ఖాతాలో వేసుకున్నాడు. గోపీచంద్‌కు ఇది ఎన్నో ఫ్లాప్ అని లెక్కబెట్టుకోవడం కూడా అభిమానులు మానేశారు. ఇప్పుడతడి ఆశలన్నీ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా మీదే ఉన్నాయి.

ఈ మూవీ మొదలై చాలా రోజులైంది. కానీ మొదలైనపుడు కొంత హడావుడి చేశారు. తర్వాత సౌండ్ లేదు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ పరంగా ఏవో ఇబ్బందులు తలెత్తాయని.. షూటింగ్ ఆగిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు.

కట్ చేస్తే ఈ రోజు గోపీచంద్ ఉగాది సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి.. ఏప్రిల్ 11న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ మీద పీపుల్స్ మీడియా బేనర్ లోగో.. టీజీ విశ్వప్రసాద్ పేరు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ముందు ఇద్దరు కొత్త నిర్మాతలు కలిసి ‘చిత్రాలయం’ బేనర్ మీద ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఐతే బడ్జెట్ సమస్యల దృష్ట్యా అందులో ఒకరు తప్పుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని టేకోవర్ చేసే ప్రొడ్యూసర్ కోసం చూశారు.

ప్రస్తుతం టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్న విశ్వప్రసాద్ ముందుకు వచ్చారు. ఆయన ఈ చిత్రంలో భాగస్వామిగా మారారు. ఈ రకంగా గోపీచంద్‌కు ఆయన చేస్తున్నది పెద్ద సాయమే. ఆగిపోయేలా ఉన్న సినిమాను టేకోవర్ చేయడం చిన్న విషయం కాదు. మరి ఏప్రిల్ 11న ఫస్ట్ గ్లింప్స్‌తో గోపీ-వైట్ల జోడీ ఏమేర మెప్పిస్తుందో చూడాలి.