అగ్ర ద‌ర్శ‌కుడిపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు


ఇప్పుడంద‌రూ క‌రోనా గురించే మాట్లాడుకుంటున్న త‌రుణంలో ఓ మ‌ల‌యాళ న‌టి మీటూ ఆరోప‌ణ‌ల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత‌ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు, కేరళ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ ఛైర్మన్‌ కమల్ మీద సంచ‌లన ఆరోప‌ణ‌లు చేసింది. ఆయ‌న తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స‌ద‌రు న‌టి త‌న పేరు వెల్ల‌డించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఐతే క‌మ‌ల్ చాలా పెద్ద ద‌ర్శ‌కుడు కావ‌డంతో కేర‌ళ మీడియాలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చనీయాంశం అయింది.

క‌మ‌ల్ తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే ‘ప్రణయ మీనుకలుడే కాదల్‌’ అనే సినిమాలో అవకాశం ఇస్తాన‌ని ఆశ చూపి.. దానికి ప్రతిఫలంగా కోరిక తీర్చమన్నాడని ఆ న‌టి ఫిర్యాదులో పేర్కొంది. 2018లో మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలో కమల్‌ తెరకెక్కించిన ‘ఆమి’ సినిమా షూటింగ్‌ సమయంలో ఇదంతా జరిగిందని ఆమె చెప్పింది.

‘ఆమి’ సినిమా షూటింగ్‌ సమయంలోనే క‌మ‌ల్ త‌న‌ను వేధించాడ‌ని.. తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించాడ‌ని.. ఆయ‌న్ని ఎంతో న‌మ్మాన‌ని.. కానీ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. ఆయన తోడేలులాంటి వ్యక్తి అని ఆ న‌టి త‌న ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఆరోపణలపై కమల్‌ స్పందించాడు. ఆమెవి ఆధారాలు లేని ఆరోపణలని.. గత ఏడాదే ఆమె త‌న‌కు లీగ‌ల్ నోటీసు పంపింద‌ని.. ఈ విషయమై త‌న‌ న్యాయవాదిని సంప్రదించాన‌ని.. ఆమె తదుపరి చర్యలు తీసుకుంటే చట్టబద్ధంగా ముందుకు వెళ్దామని అనుకున్నాన‌ని.. అప్పుడు ఆమె సైలెంటుగా ఉండిపోయింద‌ని.. కానీ ఇప్పుడు త‌న పేరు ప్ర‌తిష్ట‌ల్ని దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని.. ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచి ఉండి ఇప్పుడు ఫిర్యాదు చేయ‌డం దురుద్దేశంతో కూడుకున్న‌దే అని క‌మ‌ల్ అన్నాడు.