ప్రీమియర్ లేదు….ములాఖత్ మాత్రమే

ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ముందు రోజు మీడియాతో పాటు వాళ్ళ కుటుంబాలకు ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ వేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడది లేదు. యథావిధిగా ములాఖత్, రాత్రి డిన్నర్ ఉంటాయి కానీ షో మాత్రం వేయరని సమాచారం. గత కొంత కాలంగా స్పెషల్ ప్రీమియర్ల ఫలితాలు అనూహ్యంగా ఉంటున్నాయి. బేబీ, మేజర్ లాంటివాటికి అద్భుతంగా వర్కౌట్ కాగా రంగబలి లాంటివి డ్యామేజయ్యాయి. శాకుంతలంకు ఇదే స్ట్రాటజీ రివర్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ లెక్కలన్నీ వద్దనుకుని ఫైనల్ గా డ్రాప్ అయ్యారట.

ఇప్పుడు దీని స్థానంలో రేపు ఉదయం కామన్ ఆడియన్స్ కు కూడా ఎర్లీ షోలు వేయబోతున్నారు. హైదరాబాద్ పలు సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో ఉదయం 7 నుంచే ఫ్యామిలీ స్టార్ ప్రదర్శనలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకరకంగా ఇది మంచి ఎత్తుగడ. ఎందుకంటే అంచనాలున్న సినిమాలకు ముందు రోజు షోల వల్ల సోషల్ మీడియా టాక్ రకరకాలుగా తిరుగుతుంది. దీని వల్ల సాధారణ ప్రేక్షకులు కొంత అయోమయానికి గురై మొదటి రోజు థియేటర్లకు దూరంగా ఉన్న సందర్భాలు లేకపోలేదు. అందుకే దిల్ రాజు చాలా క్యాలికులేటెడ్ గా నిర్ణయం తీసుకున్నారు.

దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇవాళ అందుబాటులో లేకపోవడం కూడా ప్రీమియర్ పరంగా ఇబ్బందయ్యింది. దిల్ రాజు, దర్శకుడు పరశురామ్, మృణాల్ ఠాకూర్ తదితరులు మీడియా సభ్యులతో మాట్లాడబోతున్నారు. రెగ్యులర్ గా టీమ్ మెంబెర్స్ మాట్లాడం లాంటిది కాకుండా కేవలం అతిథులుగా వచ్చిన వాళ్ళను స్టేజి మీదకు పిలిచి వాళ్ళ ఫ్యామిలీలో స్టార్ ఎవరో చెప్పించి ఆ అనుభవాలను జ్ఞాపకంగా ఇవ్వబోతున్నారు. ఐడియా బాగుంది. టిల్లు స్క్వేర్ రెండో వారం జోరులోనూ భారీ సంఖ్యలో థియేటర్లను దక్కించుకున్న ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బెస్ట్ ఓపెనింగ్ నమోదవుతుంది.