ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో టిల్లు స్క్వేర్ టీమ్ ఆనందం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ మొత్తం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హవానే కనిపిస్తోంది. రివ్యూలు కొంత పాజిటివ్ గా వచ్చినా సరే ది గోట్ లైఫ్ ఆడు జీవితంని అంతగా పట్టించుకోకపోగా, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ విజువల్ ఎఫెక్ట్స్ ఎంత కట్టిపడేసేలా ఉన్నా యూత్ మాత్రం టిల్లు అన్నకే ఓటేస్తున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది. తాజాగా టిల్లు క్యూబ్ అంటే మూడో భాగం అఫీషియలయ్యింది. నిన్నటి నుంచే ఎండ్ కార్డుకు ముందు టైటిల్ వేసేసి కన్ఫర్మ్ చేశారు సితార మేకర్స్.
టిల్లు ఫ్రాంచైజ్ మీదున్న క్రేజ్ దృష్ట్యా మూడో భాగం మంచి నిర్ణయమే కానీ ఒక్క రిస్క్ మాత్రం కనిపిస్తోంది. ఇప్పటిదాకా సీక్వెల్స్ అన్నీ దక్షిణాదిలో టూ పార్ట్స్ కే పరిమితమయ్యాయి. బాహుబలి, కెజిఎఫ్ లాంటివి మంచి ఉదాహరణలు. బాలీవుడ్ లో అలా కాదు. ప్రస్తుతం హౌస్ ఫుల్ 5 రెడీ అవుతోంది. గోల్ మాల్ 3, టైగర్ 3, ఫక్రే 3, సింగం 3 ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటిలో హిట్లు ఫట్లు రెండూ బోలెడు. కానీ టాలీవుడ్ లో ఈ తరహా ప్రయోగం ఎవరూ చేయలేదు. సో ఇది ఒకరకంగా పెద్ద బాధ్యత. ఇందులోనూ విజయవంతమైతే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.
ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు మొదలుకాలేదని సమాచారం. లైన్ ఉంది కానీ ఇంకా డెవలప్ చేయాలి. టిల్లు క్యూబ్ కి ఈసారి ఫార్మాట్ మారుస్తారని తెలిసింది. అమ్మాయి చేతిలో మోసపోయే థీమ్ ని బ్యాక్ లేయర్ లో పెట్టి ఇంకో కొత్త పాయింట్ ని తీసుకొస్తారని అంటున్నారు. నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్ లను మ్యాచ్ చేసే హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలి. బోల్డ్ కంటెంట్ డోస్ కూడా పెంచాల్సి రావొచ్చు. దర్శకుడిగా మల్లిక్ రామ్ కొనసాగుతాడా లేక ఫస్ట్ పార్ట్ కు చేసినట్టు ఏదైనా మార్పు ఉంటుందా ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. టిల్లు క్యూబ్ 2025 విడుదలని లక్ష్యంగా పెట్టుకుంది.