అల్లు అర్జున్ చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ సిటీ దాటి బయటికి వెళ్లాడు. బయట అభిమానుల్ని కలిశాడు. తన కొత్త లుక్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని తన సన్నిహితులతో కలిసి సందర్శించాడు బన్నీ. ఈ సందర్భంగా అక్కడికి బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తునే హాజరయ్యారు.
ఐతే కరోనా టైంలో బన్నీ జాగ్రత్తలు పాటిస్తూ కారు లోపలినుంచే అభిమానులకు అభివాదం చేశాడు. ఫ్యాన్స్ కూడా అతను లోపలుండగానే సెల్ఫీలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవి చూసి బన్నీ ఊరికే సరదాగానే కుంటాల జలపాతం చూసేందుకు వెళ్లాడని అంతా అనుకున్నారు. కానీ అసలు కథ వేరు.
తన కొత్త చిత్రం పుష్ప లొకేషన్ల వేటలో భాగంగా బన్నీ హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తన టీంతో కలిసి అతను మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడి అటవీ ప్రాంతాన్ని అతను పరిశీలించాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే పుష్ప కథలో కీలక సన్నివేశాల్ని అటవీ ప్రాంతంలో తెరకెక్కించాల్సి ఉంది. అందుకు కనీసం రెండు నెలలు పడుతుందట.
ముందు కేరళలో షూటింగ్ అనుకున్నారు. అంతా ఏర్పాట్లు చేసుకున్నాక కరోనా వచ్చి అడ్డం పడింది. ఇప్పుడిప్పుడే కేరళకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో తూర్పుగోదావరిలో రంపచోడవడం, మడ అడవులు పరిశీలనలోకి వచ్చాయి. అక్కడా కష్టమే అని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ గురించి చర్చ జరిగింది.
ఇప్పుడేమో బన్నీ తన టీంతో కలిసి మహారాష్ట్ర-తెలంగాణ బార్డర్కు వెళ్లాడు. మామూలుగా లొకేషన్ల వేట దర్శకుడే చూసుకుంటాడు కానీ.. ఇక్కడ మాత్రం సుక్కు లేకుండా బన్నీనే ఆ పనిలో పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. వాళ్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ అలాంటిది మరి.