మైత్రి…ఇది మాములు భీభత్సం కాదు

ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థలు వరసగా సినిమాలు తీయడంలో సంవత్సరం పొడవునా బిజీగా ఉండేవి. కానీ ఇప్పుడలా సాధ్యపడటం లేదు. అందుకే అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి అనుభవజ్ఞులు మెల్లగా అడుగులు వేస్తుండగా, దిల్ రాజు సైతం ఒక ప్రణాళికతో ప్లాన్ చేసుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కౌంట్ పరంగా దూసుకుపోతున్నా క్వాలిటీని మెరుగు పరుచుకోవడంలో కార్పొరేట్ మోడల్ లో వెళ్తోంది. వీళ్లకు భిన్నంగా మైత్రి మూవీ మేకర్స్ చూపిస్తున్న స్పీడ్, పెట్టుకున్న లైనప్ చూస్తే భీభత్సం అనే మాట చిన్నదే అనిపిస్తుంది. అన్ని ప్రాజెక్టులతో క్రేజీగా కన్పిస్తోంది.

ఓసారి వాటి మీద లుక్కేస్తే ‘పుష్ప 2 ది రూల్’ ఆగస్ట్ లో వచ్చేందుకు ముస్తాబవుతోంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్యాన్ ఇండియా బిజినెస్ మాములుగా జరగడం లేదు. ఈ ఏడాది కాకపోయినా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే సంవత్సరం రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. ‘జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్’ కాంబోలో మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకొద్ది నెలల్లో కొలిక్కి వచ్చేస్తుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న ‘ఆర్సి 16’లో భాగస్వామ్యంతో పాటు సుకుమార్ తో తీయనున్న ‘ఆర్సి 17’కి సోలో ప్రొడక్షన్ హౌస్ గా వ్యవహరించనుంది. ప్రభాస్-హను రాఘవపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

ఇవి కాకుండా తమిళ, మలయాళంలోనూ డెబ్యూలు జరిగిపోతున్నాయి. సన్నీ డియోల్ తో హిందీ ప్రాజెక్టు ఓకే అయ్యింది. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇంకోవైపు టీవీ సీరియల్ నిర్మాణంలోనూ మైత్రి అడుగు పెట్టేసింది. గత ఏడాది సంక్రాంతి టైంలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి స్వంతంగా తీసిన సినిమాలతో పాటు ఇటీవలే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, హనుమాన్ రూపంలో భారీ లాభాలు కళ్లజూసింది. ఓటిటిలో సత్తిగాని రెండెకరాలు లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా ఎంటర్ టైన్మెంట్ రంగంలో అవకాశమున్న ప్రతిచోట మైత్రి అడుగు పెడుతోంది. ఇంకా చర్చల్లో ఉన్నవి బోలెడున్నాయి.