ప్రేమలు దెబ్బకు తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న మమిత బైజు కొత్త తమిళ సినిమా రెబల్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. పెద్ద బడ్జెట్ తో తీసిన మూవీ కావడంతో అంచనాలు బలంగానే ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి పని చేసిన జివి ప్రకాష్ కుమార్ హీరో. మనకు తెరమీద కనిపించడు కానీ కోలీవుడ్ లో ఇతనో మీడియం స్టార్. పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగిన రెబెల్ కు డివైడ్ టాక్ తో పాటు క్రిటిక్స్ నుంచి అధిక మొత్తంలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఓపెనింగ్స్ కూడా ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి .
బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే రెబెల్ 80 నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. మున్నార్ తోటల్లో పని చేసే కూలీల పిల్లలు కేవలం చదువు లేని కారణంగా ఆర్థికంగా సామాజికంగా ఎన్నో అవమానాలు ఎదురుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కథిర్ (జివి ప్రకాష్) అతని స్నేహితులు పలక్కడ్ లోని ఓ ప్రముఖ కాలేజీలో సీటు సంపాదించుకుంటారు. అక్కడ రెండు విద్యార్ధి వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించి ఉంటాయి. ఈ పరిణామాల వల్ల కథిర్ గ్యాంగ్ తీవ్ర సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో తిరగబడి పోరాడి రెబల్ కావాలని నిర్ణయించుకోవడమే కథ.
పాయింట్ బాగున్నప్పటికీ దర్శకుడు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే వల్ల ఆశించిన స్థాయిలో గ్రిప్పింగ్ గా అనిపించదు. పైగా సహజత్వానికి దూరంగా సన్నివేశాలు, సంఘటనలు ఉండటంతో ఒక రస్టిక్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కలగదు. ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు టచ్ చేసారు కానీ బ్యాలన్స్ కాలేదు. మమిత బైజుకి ప్రేమలు తరహాలో పెర్ఫార్మన్స్ కి ఎక్కువ స్కోప్ దక్కలేదు. చూస్తుంటే మనకు ప్రభాస్ రెబల్ ఎలా అయితే ఒక బ్యాడ్ మెమరీగా నిలిచి పోయిందో ఇప్పుడీ జివి ప్రకాష్ రెబల్ కూడా అదే బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకునేలా కనిపిస్తోంది. తెలుగులో రావడం డౌటే.