పవన్ టు శిరీష్.. క్రెడిట్ చిరుదే-అల్లు అరవింద్

అల్లు అరవింద్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంటి మనిషి. చిరును అరవింద్ పొగిడితే.. ఆయన గొప్పదనం గురించి వివరిస్తే ఒకప్పుడు అదొక సాధారణ విషయమే. కానీ ఈ మధ్య అరవింద్ తనయుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి, సోషల్ మీడియా జనాల తీరు వల్ల అది కూడా చాలా ప్రత్యేకమైన విషయంగా మారిపోయింది. హీరోగా ఎదిగే క్రమంలో అల్లు అర్జున్ చిరు గురించి గొప్పగా మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్‌ను సైతం కొనియాడేవాడు. కానీ ‘సరైనోడు’ ఈవెంట్లో చెప్పను బ్రదర్ అన్న దగ్గర్నుంచి కథ మారిపోయింది.

నెమ్మదిగా అతను మెగా గొడుగు నుంచి బయటికి వచ్చి ‘అల్లు’ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ మధ్య మెగా అనే పదమే వాడట్లేదు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మెగా అభిమానుల్లోనే ఒక వర్గం అల్లు వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

ఇలాంటి పరిస్థితుల్లో చిరు గురించి అల్లు అరవింద్ గొప్పగా మాట్లాడ్డం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహా ఓటీటీ భాగస్వామ్యంతో హైదరాబాద్ వేదికగా జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో చిరంజీవిని సత్కరించారు. ఇటీవలే ఆయన పద్మవిభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా చిరు మెగా ఫ్యామిలీ కోసం వేసిన బాట గురించి అరవింద్ మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ దగ్గర్నుంచి అల్లు శిరీష్ వరకు హీరోలు కావడానికి చిరునే కారణమని.. వాళ్లందరి కోసం ఆయన పెద్ద రహదారి వేశారని అరవింద్ అన్నారు. తమ కుటుంబంలోని వారికే కాక యువ నటీనటులు ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారని చిరును కొనియాడారు అరవింద్. చిరు తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా అరవింద్ మాట్లాడారు. ఆయన ప్రసంగానికి ఆహూతుల నుంచి మంచి స్పందన వచ్చింది.